Prashant Kishor: జగన్‌ పార్టీ గెలవడం అసాధ్యం

‘జగన్‌ తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రానురాను ఆయన పరిస్థితి మరింత దిగజారుతోంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవడం అసాధ్యమని అంచనా వేయడం ఏమాత్రం కష్టంకాదు. ఆయన ఓడిపోతున్నారు. అదేదో మామూలు ఓటమి కాదు. ఘోరంగా ఓడిపోబోతున్నారు.

Updated : 07 Mar 2024 06:39 IST

ఏపీలో క్లాస్‌ వార్‌ అంటే కుదరదు
రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కావాలి
భాజపాను జగన్‌ గుడ్డిగా నమ్మారు
సొంత కుటుంబ వ్యవహారాల్లోనూ తప్పటడుగులు
ఆయన తప్పిదాలే... ప్రతిపక్షానికి శ్రీరామరక్ష
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యలు
ఈనాడు - అమరావతి

‘జగన్‌ తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రానురాను ఆయన పరిస్థితి మరింత దిగజారుతోంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవడం అసాధ్యమని అంచనా వేయడం ఏమాత్రం కష్టంకాదు. ఆయన ఓడిపోతున్నారు. అదేదో మామూలు ఓటమి కాదు. ఘోరంగా ఓడిపోబోతున్నారు. ఆయనను ఓడించడం కష్టమని ఇంకా ఎవరైనా నమ్ముతుంటే అంతకంటే తప్పుడు అంచనా మరొకటి ఉండదు’ అని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ స్పష్టం చేశారు. ‘ద న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఆదివారం హైదరాబాద్‌లో ఏపీ రాజకీయాలు, ఎన్నికలపై ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమం పూర్తి వీడియోను ఆన్‌లైన్‌లో తాజాగా అప్‌లోడ్‌ చేశారు. ముఖ్యాంశాలు ఇవీ..

కేసీఆర్‌ను నమ్మి దెబ్బతిన్నారు

ఐదేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాల్నీ పక్కన పెట్టి... కేంద్రంలో భాజపాకు అనేక అంశాల్లో జగన్‌ బేషరతుగా మద్దతిచ్చారు. ఇప్పుడు అదే భాజపా... తెదేపా వైపు చూస్తోంది. సలహాదారులు, మిత్రపక్షాలు, భాగస్వాముల్ని ఎంచుకోవడంలో జగన్‌ ఎలాంటి తప్పటడుగులు వేశారో చెప్పడానికి ఇదే నిదర్శనం. జగన్‌ మొదట కేసీఆర్‌ను నమ్మారు.. దెబ్బతిన్నారు. భాజపాను గుడ్డిగా సమర్థించారు. సొంత కుటుంబ వ్యహారాల్లోనూ తప్పటడుగులు వేశారు. తప్పులు చేసినప్పుడు మూల్యం చెల్లించక తప్పదు.

అది అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం

జగన్‌ ఐదేళ్ల పాలనలో భారీగా అప్పులు చేసి, ప్రజలకు తాయిలాలు ఇవ్వడమే ఏకైక పనిగా పెట్టుకున్నారు. ‘మిడిల్‌ ఇన్‌కం’ రాష్ట్రాల విభాగంలోకి ఏపీ వస్తుంది. అలాంటి రాష్ట్రంలో మూలధన పెట్టుబడి, మౌలిక వసతుల కల్పనను పూర్తిగా గాలికొదిలేయడం జగన్‌ చేసిన అతి పెద్ద వ్యూహాత్మక తప్పిదం. జగన్‌ అనుసరించిన విధానం అల్పాదాయ రాష్ట్రాల్లో ఓట్లు సంపాదించేందుకు ఉపయోగపడుతుందేమో గానీ... ఏపీ వంటి 50 శాతానికిపైగా పట్టణ ప్రజలున్న రాష్ట్రాల్లో కాదు. వైకాపా ప్రభుత్వం ఇస్తున్న రాయితీలకు 50 శాతం ప్రజలు అర్హులు కాదు. అంటే వారిని పూర్తిగా విస్మరించినట్లే కదా? ఆ వర్గం వారంతా అభివృద్ధి చేసే ప్రభుత్వాన్నే కోరుకుంటారు. పైగా ఈ ఎన్నికల్ని క్లాస్‌ వార్‌(పేదలు, ధనికుల మధ్య పోరాటం)గా జగన్‌ చిత్రీకరిస్తున్నారు. బిహార్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో క్లాస్‌ వార్‌ గురించి మాట్లాడితే ప్రయోజనం ఉంటుందేమోగానీ... తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కాదు. అయినా నగదు బదిలీ(డీబీటీ)ని చూపించి... పెత్తందారులపై పోరాటం చేస్తున్నామని చెబితే ప్రజలు నమ్మరు. సమాజంలో అధికసంఖ్యలో ఉన్న చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారే తప్ప ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల లబ్ధి కోసం కాదు. వాళ్లు ఉపాధినిచ్చే పరిశ్రమల్ని, మెరుగైన రహదారుల్ని, విద్య, వైద్య వసతుల్ని అందించే ప్రభుత్వం కోసం చూస్తున్నారు.

ప్రజలు తననో దేవుడిలా చూడాలన్నది జగన్‌ ఉద్దేశం

ఏపీలో తెదేపా లబ్ధి పొందనుందంటే అది ఆ పార్టీ చేసిన కృషి కంటే కూడా... జగన్‌ తప్పిదాలు, చేయకూడని పనులు చేయడం వల్లే. జగన్‌ వయసు, గత ఎన్నికల్లో సాధించిన భారీ విజయం దృష్ట్యా... ఆయన దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తిమంతుడైన నాయకుడిగా ఎదిగి ఉండాలి. కానీ ఆయన తనకు తానే అడ్డుగోడలు కట్టుకున్నారు. ఒక చట్రానికి పరిమితమయ్యారు. అదీ ఒక చోట కూర్చుని... అక్కడి నుంచే డీబీటీ ఇస్తూ వచ్చారు. ప్రజలంతా తననో దేవుడిలా, అన్ని అవసరాలూ తీర్చే ‘ప్రొవైడర్‌’గా చూడాలన్న భావనకు వచ్చారు. ఒక నాయకుడు తనను తాను జనం అందరికీ ప్రొవైడర్‌గా భావించడం మొదలు పెట్టాడంటే... అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం చేసినట్టే. ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రొవైడర్లు కాదు. కానీ చాలామంది అలా భావించుకుంటారు. తెలంగాణలో కేసీఆర్‌ చేసిందీ అదే. పాలకుడు ఒక ప్యాలెస్‌లో కూర్చుని ప్రజలందరి అవసరాలు తానే తీరుస్తున్నానుకోవడం సరికాదు. తాము ఎన్నుకున్న పాలకుడు... ఒక ‘ప్రొవైడర్‌’ పాత్రకే పరిమితం కాకుండా, మరింత మెరుగైన బాధ్యత నిర్వర్తించాలని ప్రజలు కోరుకుంటారు.

ప్రజలకు రాయితీలకు మించిన ఆకాంక్షలుంటాయి

మధ్యాదాయ రాష్ట్రాల్లోని ప్రజలు రాయితీల కోసం చూడరని కాదు గానీ... దానికి మించిన ఆకాంక్షలు వారికి ఉంటాయి. 40-60 శాతం పట్టణీకరణ జరగడం, విద్యావంతులు ఎక్కువగా ఉండటం వంటి సామాజిక పరిస్థితులున్న రాష్ట్రంలో పాలకుడు మొత్తం వనరులన్నింటినీ కొన్నింటి మీదనే వెచ్చిస్తే కచ్చితంగా దెబ్బతింటారు. జగన్‌ చెసిన అతి పెద్ద తప్పిదం అదే. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ గెలవడం అసాధ్యం.

ఇష్టానుసారం పంచడానికి మీ జేబులో సొమ్మా?

జగన్‌ తనను తాను నాయకుడి కంటే... ప్రొవైడర్‌గానే ఎక్కువగా ఊహించుకోవడం వల్లే సమస్యంతా. నాయకుడైతే తన కేడర్‌ గురించి, మద్దతుదారుల గురించి, రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. ప్రొవైడర్‌ తనకు ఓట్లు వేసేవారినే లక్ష్యంగా చేసుకుని అన్నీ పంచాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఇక రాజధానిని నిర్మించడం, రోడ్లు వెయ్యడం, ఫ్యాక్టరీలు కట్టడం అనవసరమని, అవి ఓట్లు తెచ్చేవి కాదన్న భావనలో జగన్‌ ఉంటారు. నాయకుడు తాను అందరి అవసరాలూ తీర్చేవాడినని భావించడం పెద్ద తప్పు. ఐదు కోట్ల ప్రజల అవసరాల్ని ఏ ప్రభుత్వమూ తీర్చలేదు. అన్ని వనరులుండవు. అయినా మీరు ఎవరి వనరుల్ని పంచుతున్నారు. అవి మీ సొంతం కాదు కదా? ప్రజల సంపద పంచడానికి మీరెవరు? ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తులకు సంరక్షకురాలు మాత్రమే. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొన్నది సంపదను వృద్ధి చేసి, ఆ ఫలాల్ని వారికి అందిస్తారనే. కేవలం పంచడంపైనే దృష్టిపెట్టి... అభివృద్ధిని, సంపద సృష్టిని గాలికొదిలేస్తే ప్రజలు హర్షించరు.

సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టాలి

తెలంగాణలో ఉచిత పథకాలు కేసీఆర్‌ను గెలిపించలేక పోయాయి. రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్‌ బఘేల్‌ ప్రభుత్వాలకూ అదే అనుభవం ఎదురైంది. ప్రభుత్వాలు వనరుల నిర్వహణతో పాటు, రాష్ట్రం, సమాజం, వ్యక్తుల సామర్థ్యాల్ని పెంచడంపైనా దృష్టి పెట్టాలని ప్రజలు భావిస్తారు. ప్రజలకు నమ్మకం ఇవ్వగలగాలి. అది చేయలేనప్పుడు ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసించరు. తమిళనాడులో కామరాజ్‌ తరహా విధానాలు ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయంటే అదే కారణం. ఉదాహరణకు ప్రాథమిక విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే... అది పిల్లల్లో సామర్థ్యాల పెంపునకు దోహదం చేస్తుంది. ఉచిత పథకాలు ఓట్లు రావడానికి కొంత వరకే పనిచేస్తాయి తప్ప... అవి ఒక లెగసీని సృష్టించ లేవు. గొప్ప నాయకుడిగా ఎదిగేందుకు దోహదం చేయవు.

వైకాపా వాళ్లు నాపై దుమ్మెత్తి పోస్తారు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో భాజపా ఎక్కువ స్థానాలు గెలుస్తుందని నేను చెబితే... నేను భాజపా ఏజెంట్‌నంటూ తిట్టిపోశారు. ఎవరో తిడతారని వాస్తవం చెప్పకపోతే నా వృత్తికి న్యాయం చేసినవాడిని అవను. వాళ్లు కోరుకున్నది చెప్పడానికి నేనేమీ అధికార ప్రతినిధిని కాను. జగన్‌ పార్టీ ఓడిపోతుందని చెప్పినందుకు వచ్చే నెల, నెలన్నర రోజులపాటు వైకాపా నాయకులు, కార్యకర్తలు నేను తెదేపాకు అమ్ముడుపోయాయని దుమ్మెత్తి పోసే అవకాశముంది. కానీ వాస్తవం అదే.

నేను తెదేపా కోసం పని చేయడం లేదు

నేను ఈ ఎన్నికల్లో తెదేపా కోసంగానీ, మరే ఇతర రాజకీయ పార్టీ కోసం గానీ పనిచేయడం లేదు. రెండు మూడు నెలల క్రితం చంద్రబాబును కలిశాను. కానీ ఆ సందర్భం వేరు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, చంద్రబాబు మంచి మిత్రులు. నేను తృణమూల్‌ కోసం పని చేసినప్పుడు... చంద్రబాబును కలవాల్సిందిగా మమత నాకు సూచించారు. కానీ రెండేళ్లపాటు నేను వెళ్లలేదు. ఐప్యాక్‌ సంస్థ జగన్‌ కోసం పని చేస్తుండటంతో... నేను కూడా ఇప్పటికీ వైకాపా తరఫున పని చేస్తున్నానన్న భావనలో చాలామంది ఉన్నారు. చంద్రబాబును ఒకసారి కలిసి... వైకాపా కోసం పనిచేయడం లేదన్న విషయమైనా చెప్పాలని మధ్యలో కొందరు నాపై ఒత్తిడి చేశారు. అందుకే ఆయనను మర్యాదపూర్వకంగా కలిశాను. మూడు గంటలపాటు భేటీ జరిగింది. నేను చెప్పాల్సింది చెప్పాను. ఈ ఎన్నికల్లో ఆయన పోరాటం ఆయనే చేస్తున్నారు. గత ఎన్నికల తర్వాత నేను ఏపీకి ఒకటి రెండుసార్లు, అదీ తిరుమల శ్రీవారి దర్శనానికే వెళ్లాను. నేను పని చేసిన పార్టీ గెలిచాక... మళ్లీ వీలైనంత వరకు నేను ఆ రాష్ట్రానికి వెళ్లను.


నేనే ఆంధ్రుడినైతే...

నేనే ఆంధ్రుడినై... విజయవాడలోనో, విశాఖపట్నంలోనో నివసిస్తుంటే... అది భవిష్యత్‌ నగరంగా ఎదగడాన్ని గర్వకారణంగా భావిస్తాను. అంతే తప్ప పొరుగు రాష్ట్రాల్లోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోచి వంటి నగరాలతో అభివృద్ధిలేని నా నగరాన్ని పోల్చుకుని ఆత్మన్యూనతతో బాధపడాలనుకోను. జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు అలాంటి భావనలోనే ఉన్నారు కాబట్టి... ఆయన ఓటమిని ఊహించడం కష్టం కాదని చెబుతున్నాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు