Kodali Nani: కొడాలి నాని అనుచరుడి కారుపై సొంత పార్టీ నాయకుడి దాడి

కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అనుచరుడు, షాడో ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్‌ కారుపై అదే పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ చోరగుడి రవికాంత్‌ మంగళవారం సాయంత్రం దాడికి పాల్పడ్డాడు.

Updated : 20 Mar 2024 07:24 IST

విజయవాడ, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అనుచరుడు, షాడో ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్‌ కారుపై అదే పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ చోరగుడి రవికాంత్‌ మంగళవారం సాయంత్రం దాడికి పాల్పడ్డాడు. ఎన్నికల ప్రచారం కోసం శశిభూషణ్‌ స్థానిక ఇందిరానగర్‌ కాలనీలోని దళిత నాయకుడు, మాజీ కౌన్సిలర్‌ బూసి ప్రకాష్‌ ఇంటికి వెళ్లారు. వార్డులో కొనసాగుతున్న ప్రచారంపై చర్చిస్తున్నారు. ఆ సమయంలో బయట నిలిపి ఉంచిన శశిభూషణ్‌ కారుపై రవికాంత్‌ కర్రతో దాడి చేశాడు. దీంతో కారు అద్దం పగిలింది. ఆ శబ్దానికి అందరూ బయటకు రావడంతో రవికాంత్‌ పారిపోయాడు. డ్రైవర్‌ రాజేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, రవికాంత్‌ను ఠాణాకు పిలిపించి మాట్లాడారు. శశిభూషణ్‌, రవికాంత్‌ మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ గతంలో రవికాంత్‌పై శశిభూషణ్‌ తప్పుడు కేసులు బనాయించినట్లు తెలుస్తోంది. దీనిపై దళిత నాయకులు కొన్ని నెలల కిందట పార్టీలకతీతంగా నిరసన తెలిపారు. ఆ సమయంలో... తమ కుమారుడిని గంజాయి కేసులో అక్రమంగా ఇరికించారని రవికాంత్‌ తల్లిదండ్రులు రోదించారు. తన పరిస్థితికి శశిభూషణే కారణమని కక్ష పెంచుకున్న రవికాంత్‌ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని