TDP: సభకు హాజరులో తెదేపా ఎంపీలదే అగ్రస్థానం

లోక్‌సభకు హాజరుకావడంలో తెదేపా ఎంపీలు దేశంలోని మిగతా అన్ని పార్టీల ఎంపీల కంటే ముందు వరుసలో ఉన్నారు.

Updated : 27 Mar 2024 07:55 IST

ప్రశ్నలు అడగడంలో 4వ స్థానం
వెల్లడించిన ఏడీఆర్‌

ఈనాడు, దిల్లీ: లోక్‌సభకు హాజరుకావడంలో తెదేపా ఎంపీలు దేశంలోని మిగతా అన్ని పార్టీల ఎంపీల కంటే ముందు వరుసలో ఉన్నారు. 17వ లోక్‌సభ 273 రోజులు నడవగా తెదేపా ఎంపీలు సగటున 229 రోజులు సభకు హాజరై అన్ని పార్టీల కంటే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎంపీలు 12 (సగటున 185 రోజుల హాజరుతో), తెరాస ఎంపీలు 13 (సగటున 181 రోజులు)వ స్థానాల్లో ఉన్నారు. అత్యధిక రోజులు సభకు హాజరైన వారిలో తెదేపా తర్వాత స్థానం సీపీఎం సభ్యులదే (సగటున 226 రోజులు). 17వ లోక్‌సభ పనితీరును విశ్లేషిస్తూ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ప్రశ్నలు వేయడంలోనూ తెదేపా ఎంపీలు టాప్‌5లో నిలిచారు. ఎన్సీపీ, శివసేన, ఎంఐఎం తర్వాత అత్యధిక ప్రశ్నలు అడిగినది తెదేపాకు చెందిన ఎంపీలే కావడం గమనార్హం. ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు సభ్యులు సగటున 247 ప్రశ్నలు సంధించారు. ఈ విషయంలో వైకాపా 6, (సగటున 234), తెరాస 8వ (సగటున 211) స్థానాల్లో నిలిచాయి. నరసాపురం నుంచి ప్రాతినిథ్యం వహించిన రఘురామకృష్ణరాజు లోక్‌సభ జరిగిన 273 రోజుల్లో 267 రోజులు సభకు హాజరై (97.8%) వ్యక్తిగతంగా 17వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం 341 ప్రశ్నలు అడిగారు. తెదేపా పార్లమెంటరీ పార్టీనేత జయదేవ్‌ గల్లా సగటున 236 రోజులు హాజరై(86.4%), 291 ప్రశ్నలు వేసి 181వ స్థానంలో నిలిచారు. వైకాపా లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి 185 రోజులు హాజరై..302 ప్రశ్నలు వేసి 377వ స్థానానికి పరిమితమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని