వైకాపా పాలనలో 200కు పైగా దేవాలయాలపై దాడులు

జగన్‌ పాలనలో 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్‌సూర్య ధ్వజమెత్తారు.

Published : 27 Mar 2024 05:13 IST

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్‌సూర్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ పాలనలో 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్‌సూర్య ధ్వజమెత్తారు. బ్రాహ్మణులు, అర్చకుల్ని అణగదొక్కి తద్వారా హిందూ మతాన్ని నాశనం చేయాలనేదే జగన్‌ కుట్రని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో అర్చకులపై వైకాపా నేత దాడి ఈ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు చేయకపోతే కొడతారా? పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వరాలయంలో అర్చకుడి యజ్ఞోపవీతాన్ని వైకాపా నేత యుగంధర్‌ తెంచేశాడు. కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో ఆలయ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి అర్చకులపై దాడి చేసి, కొట్టారు. కోటప్పకొండలోనూ వైకాపా నాయకుడికి మర్యాద చేయలేదని అర్చకుడిపై దాడికి తెగబడ్డారు. వైకాపా నాయకుల భూ ఆక్రమణతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడి భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు’’ అని ఆనంద్‌సూర్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని