జగన్‌ పాలనలో ఏం ఒరిగింది?

జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడుసార్లు విద్యుత్తు, అయిదుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

Updated : 16 Apr 2024 06:48 IST

ఇది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం
పచ్చిగా మాట్లాడితే హత్యారాజకీయాల రాజ్యం
ఏపీ న్యాయయాత్రలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం

ఈనాడు, చిత్తూరు: జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడుసార్లు విద్యుత్తు, అయిదుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. జగన్‌ పాలనలో జనానికి ఏమైనా ఒరిగిందా అని ప్రశ్నించారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం, పలమనేరు, బంగారుపాళ్యంలో పర్యటించిన ఆమె మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు మద్యనిషేధం చేస్తానని హామీ ఇచ్చిన వైకాపా, అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యంతో జనాలను చంపుతోందని దుయ్యబట్టారు. ‘ప్రత్యేకహోదా వస్తే ఒక్కో నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వచ్చేవి. ఈ అయిదేళ్లు గుడ్డిగుర్రానికి పళ్లు తోమారా? సహకార చక్కెర కర్మాగారాలు తెరిపిస్తానని జగన్‌ హామీ ఇచ్చి మాట తప్పారు. మేం అధికారంలోకి వస్తే పునఃప్రారంభిస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికీ రూ.5 లక్షలతో పక్కాగృహం కట్టిస్తాం. వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛను ఖాతాల్లోనే జమచేస్తాం’ అని షర్మిల హామీ ఇచ్చారు.

మాఫియాలు, హత్యా రాజకీయాలు, గూండాయిజం అవసరమా?

‘అయిదేళ్ల కిందట ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ అమ్మఒడి కింద రూ.15వేలు వస్తుందని జగన్‌ చెప్పారు. అప్పుడు నేనూ ఆయన తరఫున మైక్‌ తీసుకుని చెప్పా. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ ఇస్తున్నారు? ఒక బిడ్డకు డబ్బు అందిస్తే మరో బిడ్డను దత్తతకు ఇవ్వాలా? జగన్‌ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో వైన్‌, మైన్‌, శాండ్‌ మాఫియా ఉంది. ఇది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం. పచ్చిగా మాట్లాడితే హత్యారాజకీయాల రాజ్యం. సొంత చిన్నాన్నను చంపిన అవినాష్‌రెడ్డిని పక్కన పెట్టుకుని జగన్‌ తిరుగుతున్నారు. హత్యా రాజకీయాలు, గూండాయిజం చేసేవారు అవసరమా? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి’ అని షర్మిల పిలుపునిచ్చారు.

జగనన్న ఓటుకు రూ.5 వేలు ఇస్తారంట

జగనన్న వచ్చే ఎన్నికల్లో గెలవటానికి ఓటుకు రూ.5 వేలు ఇస్తారంట. ఆ డబ్బంతా తీసుకోండి. అదంతా మీ దగ్గర నుంచి లాక్కున్నదే. ఆ నగదు తీసుకుని ఆయనకు ఓటు వేయొద్దు. ప్రత్యేక హోదా కోసం జగన్‌ ఒక్క సారైనా నిజమైన ఉద్యమం చేశారా..? జగన్‌ పాలనలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లాం. వైకాపాలో ఇప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి లేరు. వైకాపాలో వైఎస్‌ఆర్‌ అంటే అర్థం వేరు..వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్‌ అంటే సాయిరెడ్డి, ఆర్‌ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. చివరకు సాక్షి పత్రిక, టీవీలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కనిపించడం లేదు. వైఎస్‌ వివేకానందరెడ్డి చంపిన హంతకుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డికే ఎంపీ టికెట్‌ ఇచ్చారు. ఇది అహంకారం కాదా ? అని షర్మిల మండిపడ్డారు. పూతలపట్టు వైకాపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు ఇప్పుడు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన్ను గెలిపించాలని ప్రజల్ని షర్మిల కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని