అస్సాంలో బిగ్‌ఫైట్‌!

ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దన్నగా భావించే అస్సాం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. కానీ గత రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో భాజపా పాగా వేసింది.

Updated : 17 Apr 2024 06:15 IST

డీలిమిటేషన్‌పై ఎన్డీయే ఆశలు
గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్‌

ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దన్నగా భావించే అస్సాం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. కానీ గత రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో భాజపా పాగా వేసింది. దేశవ్యాప్తంగా 370కిపైగా సీట్లు సాధించాలంటే ఈశాన్యంలోనూ అధిక సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్న భాజపా ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈశాన్యంలో మొత్తం 25 లోక్‌సభ సీట్లున్నాయి. అందులో 14 సీట్లు ఒక్క అస్సాంలోనే ఉన్నాయి. దీంతో ఆ రాష్ట్రంపై భాజపా ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు ఒకప్పుడు తిరుగులేని పార్టీలుగా అధికారం చెలాయించిన కాంగ్రెస్‌, అస్సాం గణ పరిషత్‌ ఆ తర్వాతి కాలంలో బలహీనమయ్యాయి. అధికారానికి దూరమయ్యాయి.

ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటలు. గత పదేళ్లుగా ఈ రాష్ట్రాల్లో భాజపా పాగా వేసింది. నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మిగిలిన చోట్ల ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 9 చోట్ల విజయం సాధించింది. భాజపా భాగస్వామ్య పార్టీలైన అస్సాం గణ పరిషత్‌, యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌ ఖాతా తెరవలేదు.

అస్సాంలో ఈ నెల 19, 26, మే 7వ తేదీన 3 విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. 2019లో ఇక్కడ 81.60 శాతం పోలింగ్‌ నమోదైంది.


హిమంతపై భారం

అస్సాంలో అధిక సీట్లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు సాధించే భారాన్ని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై భాజపా కేంద్ర నాయకత్వం మోపింది. ఆయన ఈశాన్య ఎన్డీయే కూటమికి (ఎన్‌ఈడీఏ) నేతృత్వం వహిస్తున్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను గెలిచి అధినాయకత్వానికి బహుమతిగా ఇచ్చి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనేది ఆయన ఆలోచనగా ఉంది. మొత్తం ఈ ప్రాంతంలోని 25 సీట్లలో 22 గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలో 11 సీట్లలో విజయం తమదేనని అంటున్నారు.


జొర్హాట్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌.. జొర్హాట్‌లో సిట్టింగ్‌ ఎంపీ తపన్‌ కుమార్‌పై బరిలోకి దిగారు. గౌరవ్‌ 2019లో కలియాబోర్‌లో గెలిచారు. పునర్విభజన తర్వాత ఆయన జొర్హాట్‌కు మారారు. అహోం వర్గానికి చెందిన వారి ప్రాబల్యమున్న జొర్హాట్కు గతంలో గౌరవ్‌ తండ్రి తరుణ్‌ గొగొయ్‌ ప్రాతినిధ్యం వహించారు. ఆయన 3సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019లో ఈ సీటును భాజపా గెలుచుకుంది.


పునర్విభజనతో లాభం?

అస్సాంలో డీలిమిటేషన్‌ (నియోజకవర్గాల పునర్విభజన) గత ఏడాది జరిగింది. లోక్‌సభ (14), అసెంబ్లీ స్థానాల (126) సంఖ్యలో మార్పులు జరగలేదు. కానీ నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులను భారీగా మార్చేశారు. డీలిమిటేషన్‌ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. దీంతో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.

  • డీలిమిటేషన్‌ అనేది ఎన్నికల సంఘానికి చెందిన ప్రక్రియ అయినా రాజకీయ జోక్యంతో వలస ముస్లింల ప్రాబల్యమున్న నియోజకవర్గాల సంఖ్యను కుదించారనే ఆరోపణలు వచ్చాయి.
  • బార్పేటా లోక్‌సభ నియోజకవర్గంలో 77,000 మంది ఓట్లను తగ్గించారు. వారిని వేరే నియోజకవర్గానికి మార్చారు. తద్వారా ముస్లింల ప్రాబల్యమున్న ఈ నియోజకవర్గంలో ఈసారి హిందూ నేత ఎన్నికవుతారని భాజపా ఆశిస్తోంది. బార్పేటా కాంగ్రెస్‌కు కంచుకోట. 1991, 1996, 2014 మినహా ఈ నియోజకవర్గాన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌ గెలుస్తూ వస్తోంది. 1967 నుంచి 1971 వరకూ మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.  
  • 2019లో కాంగ్రెస్‌ గెలిచిన బార్పేటాలో ఎన్డీయే కూటమిలోని అస్సాం గణ పరిషత్‌ తరఫున ఫణి భూషణ్‌ చౌధరి రంగంలోకి దిగారు. ఆయన చాలా కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి దీప్‌ బయాన్‌ పోటీలో ఉన్నారు.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని