పేదలకు ఉచితంగా 10 గ్యాస్‌ సిలిండర్లు

కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఏటా 10 గ్యాస్‌ సిలిండర్లు, 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది.

Updated : 18 Apr 2024 06:17 IST

5 కిలోల బియ్యం కూడా..
‘దీదీ ప్రతిజ్ఞ’ పేరుతో తృణమూల్‌ మ్యానిఫెస్టో విడుదల

కోల్‌కతా: కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఏటా 10 గ్యాస్‌ సిలిండర్లు, 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ చేయడంతోపాటు ఎం.ఎస్‌.స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలుచేసి రైతులను ఆదుకుంటామని పేర్కొంది. కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తృణమూల్‌ ముఖ్య నేతలు పలు ప్రజా సంక్షేమ హామీలతో ‘దీదీ ప్రతిజ్ఞ’ పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరిక్‌ ఓబ్రియెన్‌ మాట్లాడుతూ.. దేశంలో సామాన్యుడికి భారంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రిస్తామని, ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను రద్దు చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత అమిత్‌ మిత్రా తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 100 రోజులపాటు పని కల్పిస్తామని, రోజుకు రూ.400 చొప్పున వేతనం చెల్లిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వెనకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఇచ్చే స్కాలర్‌షిప్‌లను మూడు రెట్లు పెంచనున్నట్లు హామీ ఇచ్చారు. సీట్ల పంపిణీలో నెలకొన్న విభేదాలతో బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేస్తున్నప్పటికీ.. ‘ఇండియా’ కూటమిలో తాము భాగంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. బెంగాల్‌లో ఈసారి తృణమూల్‌, భాజపా మధ్య హోరాహోరీ పోరు నెలకొనగా.. కాంగ్రెస్‌- లెఫ్ట్‌ పార్టీలు కలిసి లౌకిక కూటమిగా బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే.

నిర్బంధ శిబిరంగా భారత్‌: మమత

సిల్చార్‌: యావత్‌ దేశాన్ని భాజపా ఓ నిర్బంధ శిబిరంగా మార్చేసిందని బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినాయకురాలు మమతా బెనర్జీ ఆరోపించారు. విపక్ష కూటమి ‘ఇండియా’ కేంద్రంలో అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె అస్సాంలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని, ఎన్నికలూ ఉండవని వ్యాఖ్యానించారు. దేశాన్ని వాళ్లు నిర్బంధ శిబిరంలా మార్చేశారని.. ఇంత ప్రమాదకరమైన ఎన్నికలను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని