Harish Rao: భారాసపై బురదజల్లేందుకే మేడిగడ్డ పర్యటన: హరీశ్‌రావు

రాజకీయ లబ్ధి కోసమే సీఎం, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్తున్నారని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు.

Updated : 13 Feb 2024 13:22 IST

హైదరాబాద్‌: రాజకీయ లబ్ధి కోసమే సీఎం, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్తున్నారని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) ఆరోపించారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేశారన్నారు. దీన్ని ఖండిస్తున్నామని.. ఇది ప్రజాస్వామ్య విలువలను మంటగలపడమేనని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు.

‘‘ఎజెండాలో లేని అంశాలపై అధికార పార్టీ సభ్యులు ఇష్టారీతిన మాట్లాడారు. అది సభాసంప్రదాయాలకు విరుద్ధం. మేడిగడ్డ విషయంలో భారాసపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. బ్యారేజీ పర్యటనకు వెళ్లే మార్గంలో రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కూడవెల్లి వాగు, పచ్చటి పొలాలను కూడా చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నిజాలు చెప్పకుండా ఒక్క సంఘటన తీసుకుని ఆరోపణలు చేస్తున్నారు. బ్యారేజీ వద్ద లోపాలను ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలి’’ అని హరీశ్‌రావు అన్నారు.

నల్గొండ సభకు బయల్దేరిన భారాస నేతలు

ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తోందంటూ నల్గొండలో భారాస ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభకు హైదరాబాద్‌ నుంచి నేతలు తరలివెళ్లారు. తెలంగాణ భవన్‌ నుంచి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు వాహనాల్లో బయల్దేరారు. ఎన్నికల తర్వాత భారాస అధినేత కేసీఆర్ పాల్గొంటున్న సభ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచే లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించనున్నారు.  

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని