Punjab: పంజాబ్‌ కాంగ్రెస్‌లో మరో మార్పు.. ఇంఛార్జిగా హరీశ్‌ చౌదరి నియామకం

పంజాబ్‌ కాంగ్రెస్ ఇంఛార్జిగా ఉన్న హరీశ్‌ రావత్‌ను తొలగించిన కాంగ్రెస్‌ ఆయన స్థానంలో పంజాబ్‌ ఏఐసీసీ సెక్రెటరీగా ఉన్న రాజస్థాన్‌ ఆర్థిక మంత్రి హరీశ్‌ చౌదరిని నియమించింది......

Published : 22 Oct 2021 20:07 IST

దిల్లీ: పంజాబ్‌ కాంగ్రెస్ ఇంఛార్జిగా ఉన్న హరీశ్‌ రావత్‌ను తొలగించి మరో వ్యక్తిని నియమించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. హరీశ్‌ రావత్‌ను తొలగించిన కాంగ్రెస్‌ ఆయన స్థానంలో పంజాబ్‌ ఏఐసీసీ సెక్రెటరీగా ఉన్న రాజస్థాన్‌ ఆర్థిక మంత్రి హరీశ్‌ చౌదరిని నియమించింది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడిగా రావత్‌ కొనసాగనున్నట్లు తెలిపింది. పంజాబ్‌తోపాటు ఉత్తరాఖండ్‌లో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘పంజాబ్‌, చండీగఢ్‌ ఏఐసీసీ ఇంఛార్జిగా కాంగ్రెస్ హరీశ్‌ చౌదరిని నియమించింది. ఇప్పటివరకు సేవలందించిన హరీష్ రావత్‌కు ఉపశమనం కలిగించింది. ఆయన సీడబ్ల్యూసీ సభ్యుడిగా కొనసాగుతారు. ప్రధాన కార్యదర్శిగా ఆయన చేసిన కృషిని పార్టీ ప్రశంసిస్తోంది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

హరీశ్‌ రావత్‌ కాంగ్రెస్‌ ప్రధాన నేత రాహుల్‌ గాంధీని కలిసిన రెండు రోజులకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించేందుకు పంజాబ్‌ ఇంఛార్జి పదవి నుంచి తనకు ఉపశమనం కలిగించాలని రాహుల్‌ గాంధీని రావత్‌ కోరినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం రావత్‌ ట్విటర్‌ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘నా జన్మభూమికి న్యాయం చేయగలిగితేనే నా కర్మభూమికి న్యాయం చేయగలుగుతా. పంజాబ్ కాంగ్రెస్‌తోపాటు ఆ రాష్ట్ర ప్రజల నిరంతర దీవెనలు, వారి మద్దతుకు కృతజ్ఞుడిని. రాబోయే కొద్ది నెలల్లో ఉత్తరాఖండ్‌కి పూర్తి సమయాన్ని కేటాయించాలని భావిస్తున్నా. ఇందుకోసం పంజాబ్‌లో నా ప్రస్తుత బాధ్యత నుంచి నేను విముక్తి పొందాలనుకుంటున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని