Shiv Sena: రౌత్‌.. నోరు అదుపులో పెట్టుకో: భాజపా

పార్టీ గుర్తు వ్యవహారంలో ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) వర్గానికి చెందిన ఎంపీ సంజయ్‌రౌత్‌ చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) ఘాటుగా స్పందించింది. హద్దుల్లో ఉండాలని హితవు పలికింది.

Published : 19 Feb 2023 21:57 IST

ముంబయి: శివసేన పార్టీ పేరు, గుర్తు ‘విల్లు-బాణం’ కోసం రూ.2000 కోట్ల మేర ఒప్పందం జరిగిందంటూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపణలు చేయడంపై భాజపా మండిపడింది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని.. నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది. ‘‘ సంజయ్‌ రౌత్‌.. నీ హద్దుల్లో ఉండు. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు. ఉద్ధవ్‌ ఠాక్రే ఏ ఎన్నికల్లోనూ గెలవలేరు. కనీసం పోటీ కూడా చేయలేరు. ఆ వ్యక్తి నిరుత్సాహానికి గురై ఏదేదో చెబుతున్నారు’’ అంటూ ముంబయి భాజపా అధ్యక్షుడు ఆశిష్‌ షెలార్‌ విమర్శించారు. ఉద్ధవ్‌ వర్గం నేతలు నోటిని అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

శివసేన పార్టీ అధికారిక గుర్తును ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న తర్వాత.. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని భాజపా శిందే వర్గానికి వత్తాసు పలికిందని, అందులో భాగంగా ఈసీ శివసేన ‘విల్లు-బాణం’ గుర్తును శిందే వర్గానికి కేటాయించిందని ఆరోపించింది. ఓ వైపు ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉన్నా.. ఆగమేఘాల మీద ఈసీ ఎందుకు నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని విమర్శించింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే, ముఖ్యమంత్రి శిందే వర్గాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పార్టీ గుర్తును కొనుగోలు చేసేందుకు శిందే వర్గం రూ.2000 కోట్లకు ఒప్పందం చేసుకుందని సంజయ్‌ రౌత్‌ ఆరోపించగా.. శిందే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సదా సర్వాంకర్.. ఈ ఆరోపణలను ఖండించారు. అలా చెప్పడానికి సంజయ్ రౌత్ ఏమన్న క్యాషియరా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. తాజాగా ఆశిష్‌ షెలార్‌ ఘాటుగా హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని