ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం.. ఇండియా కూటమి క్షమాపణలు చెప్పాలి: రాజ్‌నాథ్‌ సింగ్

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin).. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీ ఒక్కోలా స్పందిస్తున్నాయి. మరోపక్క తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని జూనియర్ స్టాలిన్ స్పష్టంగా చేశారు.

Updated : 04 Sep 2023 16:46 IST

దిల్లీ/జైసల్మేర్: సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌(MK Stalin) తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌( Rajnath Singh) ఖండించారు. ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అశోక్‌ గహ్లోత్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాజస్థాన్‌లో భాజపా నిర్వహిస్తోన్న పరివర్తన్‌ యాత్రలో భాగంగా ఆయన జైసల్మేర్‌లో పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

‘సనాతన ధర్మంపై కాంగ్రెస్ ఉద్దేశం ఏమిటో సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే వెల్లడించడం లేదు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదు. సనాతన ధర్మాన్ని అవమానించినందుకు ప్రతిపక్షాల కూటమి ఇండియా సభ్యులు క్షమాపణలు చెప్పాలి. లేకపోతే దేశం వారిని క్షమించదు. సనాతన ధర్మం ఈ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావిస్తుంది. వసుధైక కుటుంబం అనే సందేశాన్ని ఇస్తుంది’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘రాహుల్‌యాన్‌’ అంటూ రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్‌ విజయవంతంగా దిగిందన్నారు. కానీ రాహుల్‌యాన్‌ ప్రయోగమే జరగలేదని, ఇక ల్యాండింగ్‌కు అవకాశమే లేదని వ్యాఖ్యలు చేశారు.

నడిచి నరకం నుంచి బయటపడాలని.. బురద ఎడారిలో వేల మంది అవస్థలు

ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన..

‘ప్రతి రాజకీయపార్టీకి  తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంటుంది. అన్ని మతాలను, ప్రజల నమ్మకాలను గౌరవించడమే కాంగ్రెస్ విధానం’ అని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ‘ఆ మాటలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చు. నేను మాత్రం ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin) చెప్పిన మాటలతో ఏకీభవించను’ అని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ అన్నారు. శివసేన(యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది కూడా ఉదయనిధి స్టాలిన్‌కు మద్దతుగా స్పందించారు. ఆప్‌, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఎలాంటి కేసులు ఎదుర్కోవడానికైనా సిద్ధమే: ఉదయనిధి

‘సనాతన ధర్మం గురించి నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను. కొంతమంది నా మాటలను వక్రీకరిస్తున్నారు. అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. అయినా వారి రోజువారీ పని అదేలే’ అని ఉదయనిధి(Udhayanidhi Stalin) భాజపాపై విరుచుకుపడ్డారు. భాజపా.. ఇండియా కూటమి విషయంలో ఆందోళనగా ఉందని, అందుకే ఆ కూటమి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలా అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు. వారు తనపై పెట్టే ఎలాంటి కేసునైనా ఎదుర్కోవడానికి సిద్ధమని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని