PM Modi: వారి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. రాహుల్‌ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోదీ ఫైర్‌

PM Modi: ‘శక్తి’ని నిర్వీర్యం చేస్తామంటూ విపక్ష కూటమి తమ మేనిఫెస్టోలో చెబుతోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. శక్తిని ఆరాధించేవారికి, నాశనం చేయాలనుకునేవారి మధ్యే ఈ పోరాటం అని అన్నారు. 

Updated : 18 Mar 2024 14:53 IST

జగిత్యాల: ‘శక్తి’పైనే తమ పోరాటం అంటూ కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) తాజాగా స్పందిస్తూ విపక్షాలను ఎండగట్టారు. ‘శక్తి’ని నాశనం చేస్తామంటూ కొందరు సవాళ్లు విసురుతున్నారని, తాను వాటిని స్వీకరిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రతి తల్లి, ప్రతి కుమార్తె దాని స్వరూపమే అని అన్నారు.

జగిత్యాలలో జరిగిన భాజపా (BJP) ‘విజయ సంకల్ప సభ’లో ప్రధాని మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత విపక్ష కూటమి ముంబయిలో ర్యాలీ నిర్వహించి తమ మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో ‘శక్తి’కి వ్యతిరేకంగా పోరాడుతామని వారు పేర్కొన్నారు. కానీ, ఈ దేశంలోని ప్రతి మహిళ, కుమార్తె దాని స్వరూపమే. అందుకే మనమంతా వారిని ఆరాధిస్తాం. అసలు దానిని నాశనం చేస్తామని విపక్ష కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. వారి సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. మన తల్లులు, కుమార్తెలను కాపాడుకునేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమే’’ అని మోదీ వెల్లడించారు.

భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్‌ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ

మన దేశం చేపట్టిన చంద్రయాన్‌-3 విజయవంతంగా దిగిన ప్రాంతానికీ ‘శివ శక్తి’ పేరు పెట్టినట్లు ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో శక్తిని ఆరాధించే వారికి, దాన్ని నాశనం చేస్తామని చెప్పేవారి మధ్యే పోరాటం అని తెలిపారు. ఇందులో ఎవరు గెలుస్తారనేది జూన్‌ 4నే తెలుస్తుందని అన్నారు.

ముంబయిలో ఆదివారం జరిగిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ముగింపు సమావేశంలో రాహుల్‌ గాంధీ తన వ్యాఖ్యల్లో ఈ పదాన్ని ఉపయోగించారు. ‘‘మోదీపై మా పోరాటం వ్యక్తిగతంగా కాదు. శక్తి (అధికారం)కి వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం. ఇక్కడ అధికారం అంటే ఏంటీ?అనేదే అసలైన ప్రశ్న. రాజు (మోదీని ఉద్దేశిస్తూ) ఆత్మ ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను సంస్థల్లో ఉంది. అవి లేకుండా ఆయన గెలవలేరు’’ అని ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఇవి కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని