Pawan Kalyan: ఓటములు ఎదుర్కొన్నా.. ఓరిమితో బరిలో ఉన్నాం: పవన్‌ కల్యాణ్‌

డబ్బులకు అమ్ముడు పోయానని దుష్ప్రచారం చేస్తున్నారు.. అలాంటి వారిని చెప్పుతో కొడతానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్‌ పాల్గొని ప్రసంగించారు.

Updated : 14 Mar 2023 23:31 IST

మచిలీపట్నం: ప్రజల ఆశీస్సులతో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా ధైర్యమే ఓ కవచం. ధైర్యం చేసే జనసేన పార్టీ పెట్టానని వివరించారు. ‘‘ఒక్కడిగా ప్రారంభమైన జనసేన.. ఇవాళ 6,56,000 క్రియాశీలక సభ్యులు ఉన్నారు. పదేళ్ల ప్రస్థానంలో మాటలు పడ్డాం.. మన్ననలు పొందాం. ఓటములు ఎదుర్కొన్నా.. ఓరిమితో బరిలో ఉన్నాం. రెండు చోట్ల పరాజయం పాలైనప్పటకీ.. వేలాది మంది కార్యకర్తలు, వందలాది మంది నాయకులు నా వెంట ఉన్నారు. ఎవరైనా గెలిచే కొద్దీ బలపడతారు.. కానీ, జనసేన పార్టీ దెబ్బ పడే కొద్దీ బలపడుతోంది. జనసేనకు పిడుగుల్లాంటి జనసైనికులు అండగా నిలబడ్డారు. ప్రజల అండతో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. బ్రిటీష్‌ వారు కూడా నేతాజీకి భయపడే స్వాంతంత్యం ఇచ్చారు. పార్టీ ఏర్పాటుకు స్వాతంత్య్ర ఉద్యమ నాయకులే స్ఫూర్తి. తెలంగాణ  సీఎం.. నాకు రూ.వెయ్యి కోట్లు ఆఫర్‌ చేశారని కొందరు దుష్ప్రచారం చేశారు. మరోసారి ఇలాంటి దుష్ప్రచారం చేస్తే చెప్పతో కొడతానని హెచ్చరించారు. 20 రోజులు సినిమా చేస్తే.. రూ.40 నుంచి రూ.45 కోట్లు వస్తాయి. డబ్బులు కోసం ఆశపడే వ్యక్తిని కాదు.

అగ్ర కులాల్లోని పేదలకు జనసేన అండగా ఉంటుంది..

రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తోంది. కానీ, జనసేన కులాలను కలిపేందుకు ప్రయత్నిస్తోంది. జనసేన ఉన్నదే సమాజంలో పరివర్తన తీసుకురావడానికి. ఒక కులాన్ని గద్దె ఎక్కించడం కోసం నేను వ్యతిరేకం. ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి. అన్ని కులాలు పాలనలో భాగస్వామ్యం కావాలి. కులాల ఐక్యత సమాజానికి చాలా అవసరం. అగ్ర కులాల్లో పేదలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. కులాల మధ్య చిచ్చు పెట్టలేను.. వారికి అండగా ఉంటా. కానీ, నన్ను కులం పేరుతో తిడుతుంటే బాధేస్తోంది.ఒక కులం, ఒక మతం ఆధారంగా సమాజాన్ని నడపలేం. నా సినిమాలన్నీ ఒక్క కులం వారు చూస్తే నేను రోజుకు రూ.2కోట్లు తీసుకోగలనా? నా అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారు. కులం పేరుతో కొట్టుకు చావడం ఆగాలి. అన్ని కులాల్లో ఉన్న వెనుకబాటు తనాన్ని తొలగించడమే జనసేన ధ్యేయం. మత ప్రస్థావన లేని రాజకీయాలు రావాలని కోరుకుంటున్నా.’’ అని పవన్‌ కల్యాణ్ అన్నారు.

అవకాశం ఇస్తే.. జవాబుదారీగా ఉంటాం

మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని జనసేన అధినేత పవన్‌ మండిపడ్డారు. జనసేనకు ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తే ప్రజలకు జవాబుదారీగా ఉంటామని అన్నారు. ‘‘ ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తాం. ఉపకార వేతనాలు, విదేశీ విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా. అధికారం ఇస్తే..కుల నాయకులతో పని చేయించే బాధ్యత తీసుకుంటా. నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అరాచకాలు జరుగుతుంటే ప్రజల్లో ఆవేదన లేకపోతే ఎలా?’’ అని పవన్‌  ప్రశ్నించారు.

క్రిమినల్‌ రాజకీయాలు పోవాలి

క్రిమినల్‌ రాజకీయాలు పోయి.. జవాబుదారీ రాజకీయాలు రావాలని పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. ‘‘ 98 శాతం రెడ్డి సామాజికవర్గం ఇప్పుడున్న వ్యక్తిని సీఎం చేశారు. అన్ని పదవులు ఒక్క సామాజిక వర్గానికే ఇస్తే.. మిగతా కులాలు ఏం కావాలి. జనసేన అధికారంలోకి వస్తే కులాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అసాధ్యమని గతంలోనే చెప్పాను. మద్యం అమ్మవద్దని ఆయా ప్రాంతాల్లో నిర్ణయిస్తేనే మద్యపాన నిషేధం సాధ్యమవుతుంది. అంచెలంచెలుగా రాష్ట్రమంతా మద్యపాన నిషేధం అమలు చేయవచ్చు. అబద్ధాలు చెప్పి మోసం చేయడం నాకు ఇష్టం లేదు. మద్యపాన నిషేధం అమలు చేయాలని అందరూ కోరుకోవాలి.’’ అని పవన్‌ అన్నారు.

కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం..

చనిపోయిన 47 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పవన్‌ ఆర్థిక సాయం అందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన జన సైనికులతో మచిలీపట్నం జనసంద్రంగా మారింది. మధ్యాహ్నం విజయవాడ నుంచి పవన్‌ వారాహి వాహనంలో ర్యాలీగా మచిలీపట్నం చేరుకున్నారు. 

ప్రభుత్వం దుర్మార్గమైన కుట్ర చేసింది: నాదెండ్ల

జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. ‘‘జనసేన ఎదగకూడదు, నాయకత్వం లేకుండా చేయాలని చూశారు. పార్టీ నిర్మాణం కోసం పవన్‌ పర్యటనలు చేస్తుంటే అనేక ఇబ్బందులు పెట్టారు. ప్రజల కోసం పాతికేళ్ల తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్టు గతంలో చెప్పారు. గతేడాది పార్టీ ఆవిర్భావ సభకోసం ఇప్పటం రైతులు భూములిస్తే కక్షసాధించారు. 46 మంది ఇళ్లు కూల్చడానికి ప్రభుత్వం దుర్మార్గమైన కుట్ర చేసింది. మీ ప్రేమ, అభిమానం వల్లే జనసేన పదో ఆవిర్భావ సభ జరుపుకుంటోంది. ప్రజల కోసం నినాదంతో జనసేన కార్యక్రమాలు చేపట్టింది’’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని