NDA: పొత్తు కుదిరింది.. ఎన్డీయేలో చేరిన జేడీఎస్‌

భాజపా సారథ్యంలోని ఎన్డీయేలో జేడీఎస్‌ చేరింది. ఈ చేరికతో ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ మరింత బలోపేతమవుతుందని నడ్డా పేర్కొన్నారు.

Updated : 22 Sep 2023 17:00 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన జేడీఎస్‌ పార్టీ(JDS Party) భాజపా (BJP)సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరింది. భాజపా అగ్రనేతలు అమిత్‌ షా(Amit shah), జేపీ నడ్డా(JP Nadda)తో భేటీ అనంతరం జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎన్డీయేలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ కీలక భేటీ సమయంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ కూడా అక్కడే ఉన్నారు. ఈ తాజా పరిణామంతో కర్ణాటకలో భాజపా, జేడీఎస్‌ మధ్య పొత్తు పొడుపులపై గత కొన్నాళ్లుగా వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.  అయితే, కర్ణాటకలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు.

జేపీ నడ్డా ట్వీట్..

ఈ అంశంపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్‌ చేశారు. అమిత్‌ షా సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి సమావేశమయ్యారన్నారు. జేడీఎస్‌ ఎన్డీయేలో భాగస్వామి కావాలని నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. జేడీఎస్‌ను హృదయపూర్వకంగా తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఎన్డీయేను, ప్రధాని నరేంద్ర మోదీ ‘న్యూ ఇండియా, స్ట్రాంగ్‌ ఇండియా’ విజన్‌ను బలోపేతం చేస్తుందని నడ్డా ట్వీట్‌ చేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న జేడీఎస్‌.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భాజపా సీనియర్‌ నేత, మాజీ సీఎం యడియూరప్ప లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌, భాజపా మధ్య పొత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి మాండ్యతో పాటు మరో మూడు లోక్‌సభ సీట్లు ఇస్తామని కూడా ఆయన ఆ సందర్భంలో అన్నారు. ఆ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొత్తులపై పలు రకరకాల ఊహాగానాలు కొనసాగిన అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని