సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం

హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ నాయకుడు భూపీందర్‌సింగ్‌ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్‌ చౌటాలా తెలిపారు.

Published : 09 May 2024 06:23 IST

 జననాయక్‌ జనతా పార్టీ నాయకుడు దుశ్యంత్‌ చౌటాలా వెల్లడి

చండీగఢ్‌: హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ నాయకుడు భూపీందర్‌సింగ్‌ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్‌ చౌటాలా తెలిపారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. ‘‘బలపరీక్ష జరిగితే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అనుకూలంగా ఓటు వేస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యేలకు జేజేపీ విప్‌ జారీచేస్తుందని మీకు చెప్పదలచుకున్నాను’’ అని బుధవారమిక్కడ వెల్లడించారు. ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు ప్రకటించిన మర్నాడే దుశ్యంత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మీ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతిస్తుందా? అని ప్రశ్నించగా.. ‘‘ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చర్యలు తీసుకుంటామని మాత్రమే మేం స్పష్టంగా చెప్పాం’’ అని బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో పడిందని, అందువల్ల ముఖ్యమంత్రి మెజారిటీ నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేయాలని సూచించారు. ఒకవేళ భాజపా మెజారిటీ నిరూపించుకునే ప్రయత్నాలు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించడం సహా అనేక అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. భాజపాకు మద్దతిచ్చే పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించగా.. ఇప్పుడు భాజపాతో జేజేపీ కలిసి వెళ్లదన్న సంగతిని స్పష్టం చేస్తున్నానని వ్యాఖ్యానించారు.


సర్కార్‌ మనుగడకు ఎలాంటి ఇబ్బందీ లేదు: సైనీ

తన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదని, దృఢంగా పనిచేస్తోందని హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌ సైనీ బుధవారమిక్కడ స్పష్టంచేశారు. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీ గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల సంఖ్య (మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, మరో స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్‌ చౌటాలా రాజీనామాలతో) 88కు పడిపోయింది. భాజపాకు 40 మంది సభ్యుల బలం ఉంది. ఇద్దరు స్వతంత్ర శాసనసభ్యులు, హరియాణా లోక్‌హిత పార్టీ ఏకైక సభ్యుడు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. అయినప్పటికీ మెజారిటీకి ఇంకా ఇద్దరు సభ్యుల బలం అవసరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని