Kalvakuntla Kavitha: సర్వేల్లో వాళ్లు గెలుస్తారు.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుంది: కవిత

MLC Kalvakuntla Kavitha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా భారాస ఎమ్మెల్సీ కవిత అభిమానులతో ముచ్చటించారు.

Updated : 28 Oct 2023 21:09 IST

హైదరాబాద్‌: బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తానని అమిత్‌ షా చెప్పటం ఎలక్షన్‌ స్టంట్‌ అని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఆమె అభిమానులతో ముచ్చటించారు. భాజపాతో తమకు ఎలాంటి డీల్‌ లేదని అన్నారు. లిక్కర్‌ స్కామ్‌లోనూ తన పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు కవిత చెప్పిన సమాధానాలు ఇలా...

భాజపాకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారని అమిత్‌షా అన్నారు. దీని వల్ల ఈసారి బీసీ ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకుంటున్నారా?

కవిత: రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న బీసీ నాయకుడిని మార్చి ఓసీకి ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఓబీసీల కుల గణన చేయడాన్ని కేంద్రం నిరాకరిస్తోంది. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్‌ ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదు. బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటును కూడా తిరస్కరించింది. అసెంబ్లీ, పార్లమెంట్‌లో ఓబీసీలకు 33శాతం రిజర్వేషన్‌ ఇవ్వడాన్ని కూడా కేంద్రం వ్యతిరేకిస్తోంది. అలాంటి భాజపా బీసీ వ్యక్తిని తెలంగాణకు సీఎంను చేస్తానని చెబుతోంది. ఇదొక ఎలక్షన్‌ గిమ్మిక్కు.

ఈ సారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని నమ్మకంతో ఉన్నారా?

కవిత: తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్లు. ఈ ప్రయాణం వారితోనే కలిసి సాగుతోంది. వారి ఆశీర్వాదంతోనే కచ్చితంగా 95-105 స్థానాల్లో విజయం సాధిస్తాం.

ఈ సారి రాష్ట్రంలో హంగ్‌ వస్తుందని అంటున్నారు.. మీ అభిప్రాయం?

కవిత: 2018లో వాళ్లు ఇదే ట్రిక్‌ ప్లే చేశారు. ఇలా చాలా సర్వేలను ప్రజల ముందుకు తెచ్చారు. కానీ, బీఆర్‌ఎస్‌ అఖండ విజయం సాధించింది. సర్వేల్లో కాంగ్రెస్‌, ఇతర పార్టీలనే గెలవనీయండి. ఎన్నికల్లో మాత్రం భారాస గెలుస్తుంది.

మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కోసం మీరు పోరాటం చేస్తున్నారు కదా! మరి ఈ ఎన్నికల్లో మీ పార్టీ నుంచి 33శాతం కన్నా తక్కువ మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?

కవిత: ఈ ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేయాలని మా నాయకుడు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కానీ, భాజపా పోస్ట్‌ డేట్‌ చెక్‌లా ఉంచింది. కాంగ్రెస్‌ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.

కేటీఆర్‌ ఎందుకు పలువురు ఎక్స్‌ ఖాతాదారులను బ్లాక్‌ చేస్తున్నారు. అలాగే, దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మీ పాత్ర ఉందా? స్పష్టత ఇవ్వండి

కవిత: సమంజసంగా అడిగిన ప్రతిదానికీ మీకు జవాబు లభిస్తుంది. ఆ స్కామ్‌ గురించి నాకు తెలియదు. అందులో నా పాత్ర ఏమీ లేదు.

బీఆర్‌ఎస్‌, భాజపాల మధ్య ఉన్న డీల్‌ ఏంటి?

కవిత: మా మధ్య ఎలాంటి డీల్‌ లేదు. మేము రాజకీయ ప్రత్యర్థులం.

తెలంగాణ ప్రజలు తనకు కుటుంబంలాంటి వారని రాహుల్‌ గాంధీ అంటున్నారు మీ అభిప్రాయం

కవిత: రాహుల్‌గాంధీ ముత్తాత నెహ్రూ జీ తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇక ఆయన నాయనమ్మ ఇందిరా జీ 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో 369 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నారు. ఆయన తండ్రి రాజీవ్‌గాంధీ జీ.. తెలంగాణ సీఎం అంజయ్యగారిని అవమానించారు. ఆయన తల్లి సోనియాజీ తెలంగాణ ఇస్తానని 2004 మాటిచ్చి ఐదేళ్ల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎట్టకేలకు కేసీఆర్‌ 11 రోజుల పాటు సత్యగ్రహ దీక్ష చేస్తే, తెలంగాణ ఇస్తానని ప్రకటించి, మళ్లీ 12 రోజులకే వెనక్కి తగ్గారు. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారి కూడా రాష్ట్రం గురించి ఆయన పార్లమెంట్‌లో మాట్లాడలేదు. తెలంగాణ ప్రజలకు ఆయన కుటుంబానికి కచ్చితంగా సంబంధం ఉంది. అదేంటంటే, తెలంగాణ ప్రజలను మళ్లీ మళ్లీ మోసం చేయడం.

మీరు, మీ సోదరుడు కేటీఆర్‌కు సంబంధించిన అందమైన జ్ఞాపకాన్ని చెప్పండి?

కవిత: అతను బాధ్యత కలిగిన సోదరుడు. అతనితో చాలా సంతోషకరమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక్కటని చెప్పటం కష్టం

2023 తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుస్తుంది?

కవిత: తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో సెంచరీ పక్కా..

చంద్రబాబు అరెస్ట్‌పై మీ అభిప్రాయం ఏంటి?

కవిత: ఈ వయసులో ఆయనకు అలా జరగడం దురదృష్టకరం.. ఆయన కుటుంబం పడుతున్న బాధను అర్థం చేసుకోగలను. వారి కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నా.

తండ్రి తర్వాత మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు?

కవిత: మమత దీదీ

చిరంజీవి గురించి ఒక్క మాటలో చెప్పండి. అలాగే మీ అభిమాన నటుడు ఎవరు?

కవిత: చిరంజీవికి నేను వీరాభిమానిని. ఆ తర్వాత అల్లు అర్జున్‌.. తగ్గేదేలే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని