Bommai: ఆస్తుల వివరాలు ప్రకటించిన కర్ణాటక సీఎం బొమ్మై.. విలువెంతో తెలుసా..!

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తన ఆస్తుల విలువ రూ.49.70 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. హవేరీ జిల్లాలోని షిగ్గావ్‌ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.

Updated : 15 Apr 2023 22:36 IST

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక (Karnataka)లో రాజకీయ సందడి ఊపందుకుంటోంది. ఎన్నికల ప్రక్రియ క్రమంలో నామినేషన్‌ (Nominations)ల పర్వం ఇప్పటికే మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) హవేరీ జిల్లాలోని షిగ్గావ్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం రిటర్నింగ్ అధికారి ముందు ఎన్నికల అఫిడవిట్‌ (Election Affidavit) దాఖలు చేశారు. ఇందులో బసవరాజ్ బొమ్మై తన ఆస్తుల విలువ రూ.49.70 కోట్లుగా పొందుపరిచారు.

 బొమ్మై వద్ద రూ.5.98 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. దీంతోపాటు హిందూ అవిభాజ్య కుటుంబం నుంచి రూ.1.57 కోట్ల సంపద దక్కింది. ఆయన భార్య చన్నమ్మ పేరిట రూ.1.14 కోట్లు, కూతురు అదితి పేరిట రూ.1.12 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కుమారుడు భరత్ బొమ్మై తన తండ్రిపై ఆధారపడనందున.. అతని ఆస్తుల వివరాలను పేర్కొనలేదు. అయితే, బసవరాజ్ బొమ్మై తన కుమారుడికి రూ.14.74 లక్షలు ఇచ్చినట్లు ప్రస్తావించారు.

ముఖ్యమంత్రికి రూ.42.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో హిందూ అవిభాజ్య కుటుంబం నుంచి రూ.19.2 కోట్ల ఆస్తి వచ్చింది. రూ.5.79 అప్పులు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత.. ధార్వాడ్‌లోని హుబ్బళ్లి తాలూకా తరిహాల గ్రామంలో దాదాపు మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా బసవరాజ్ బొమ్మై, ఆయనపై ఆధారపడిన వారి ఆస్తుల విలువ రూ.52.12 కోట్లుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని