Kishan Reddy: కేసీఆర్‌కు రామగుండం వచ్చే తీరిక లేదు.. కానీ నాందేడ్‌ వెళ్తున్నారు: కిషన్‌రెడ్డి

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ పునరుద్ధరిస్తే.. ప్రారంభోత్సవానికి వచ్చే తీరిక కూడా సీఎం కేసీఆర్‌కు లేకుండా పోయిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగే సభలు, సమావేశాలకు వెళ్లేందుకు మాత్రం ఆయనకు సమయం దొరుకుతుందని విమర్శించారు.

Published : 21 May 2023 14:42 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని.. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా అమలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత భారాస ప్రభుత్వంపై ఉందని చెప్పారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు పంటల బీమాను అమలు చేస్తున్నాయని.. తెలంగాణ కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. 

‘‘రోజూ కేంద్రం, ప్రధాని మోదీని తిట్టడమే కల్వకుంట్ల కుటుంబం పనిగా పెట్టుకుంది. అధికారులకు కాకుండా సలహాదారులకు సీఎం కేసీఆర్‌ పాలనాధికారాలను కట్టబెట్టారు. పాలనను వదిలేసి ఆయన మహారాష్ట్రలో భారాస సభలు, సమావేశాల పేరుతో తిరుగుతున్నారు. కేసీఆర్‌ అనేక హామీలు ఇచ్చి అమలుచేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఆయన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మహారాష్ట్రకు వెళ్లి మోదీని విమర్శిస్తున్నారు. రైతులకు కేంద్రం యూరియా, ఎరువులపై సబ్సిడీ ఇస్తోంది.. అది రైతులకే దక్కాలి. సబ్సిడీలు దళారీలకు దక్కకుండా చూడటమే మోదీ లక్ష్యం. కేంద్రం సబ్సిడీ ద్వారా ఇచ్చిన ట్రాక్టర్లను భారాస నేతలే పంచుకున్నారు. 

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ పునరుద్ధరిస్తే.. ప్రారంభోత్సవానికి వచ్చే తీరిక కూడా కేసీఆర్‌కు లేకుండా పోయింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగే సభలు, సమావేశాలకు వెళ్లేందుకు మాత్రం ఆయనకు సమయం దొరుకుతుంది. కేంద్రం ధాన్యం కొనడం లేదని రాష్ట్ర మంత్రులు దిల్లీ వచ్చి ధర్నాలు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం చేసుకున్న ఒప్పందాన్నే పూర్తిచేయలేదు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని