Kishan Reddy: కేసీఆర్‌, భారాసకు మేలు చేసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు: కిషన్‌రెడ్డి

భారాస, కాంగ్రెస్‌ ఒక్కటేనని.. అలా కాదంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సీబీఐ విచారణ కోరాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) సవాల్‌ విసిరారు.

Updated : 02 Jan 2024 19:49 IST

హైదరాబాద్‌: భారాస, కాంగ్రెస్‌ ఒక్కటేనని.. అలా కాదంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సీబీఐ విచారణ కోరాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) సవాల్‌ విసిరారు. సీబీఐ విచారణపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన 48 గంటల్లో సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని చెప్పారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘కేసీఆర్, భారాసకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోతుంది కాబట్టి.. భారాసతో అవగాహనకు వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన అవగాహన లేదు. సీబీఐతో దర్యాప్తు జరపాలని కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదో ముఖ్యమంత్రి చెప్పాలి. దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా.. లేదా? భారాస హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు ఉంది. కాంగ్రెస్, భారాస డీఎన్‌ఏ ఒక్కటనే విధంగా ఆ పార్టీల వ్యవహార శైలి ఉంది. మూడు, నాలుగేళ్లలోనే కట్టిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. ఇది కేసీఆర్ సర్కారు అవినీతి, కుంభకోణాలకి అద్దం పడుతోంది’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

మార్చి మొదటివారంలోపు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..

ఆ తర్వాత మీడియాతో చిట్‌చాట్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావొచ్చన్నారు. రాష్ట్రంలో భాజపా ఎంపీ అభ్యర్థుల ఎంపిక 50 శాతం పూర్తయిందని చెప్పారు. త్వరలోనే భాజపా శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటామన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆ స్థానంలో ప్రకాశ్‌రెడ్డి టికెట్‌ ఆశించవచ్చని.. అందులో తప్పేముందని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై త్వరలోనే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు