Kishan Reddy: తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది: కిషన్‌రెడ్డి

బండి సంజయ్‌ అరెస్టుపై న్యాయపోరాటంతో పాటు, రాజకీయంగా కూడా పోరాటం చేస్తాం అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రగతి భవన్‌ స్క్రిప్ట్‌ ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Updated : 05 Apr 2023 21:50 IST

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం రాత్రి భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ చేతిలో అధికారం ఉందని భారాస నేతలు ఇష్టమొచ్చినట్టు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమెర్జీ నడుస్తోందన్న కిషన్‌రెడ్డి.. భాజపాను ఎంత అణచివేయాలని చూస్తే అంత బలంగా ఎదుగుతుందన్నారు.  

‘‘బండి సంజయ్‌ను అనేక పోలీస్‌ స్టేషన్లు తిప్పుతూ తీసుకెళ్లారు. కనీసం ట్యాబ్లెట్‌ వేసుకునేందుకు కూడా సమయం ఇవ్వకపోవడం దారుణం. ఉగ్రవాదులను కూడా ఈ విధంగా  తరలించలేదు. సంజయ్‌కు ఒక జర్నలిస్టు వివరాలు అందించటం నేరమా? జిల్లాల సమాచారాన్ని జర్నలిస్టులు నేతలతో పంచుకోవటం సహజం. సమాజ హితం కోసం, అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చే సంప్రదాయం జర్నలిస్టులకు ఉంది. కొన్ని అంశాలు పత్రికల్లో రాస్తారు, కొంత సమాచారం నేతలకు ఇస్తారు. మిత్రులకైతే వ్యక్తిగతంగా సలహాలు ఇస్తారు. 11.24 గంటలకు ప్రశాంత్‌ అనే జర్నలిస్టు అందరికీ పంపిన తర్వాత 11.30 గంటలకు బండి సంజయ్‌కు ప్రశ్నపత్రం పంపారు. ఆ మెసేజ్‌ వచ్చినప్పుడు పరేడ్‌ గ్రౌండ్‌లో పత్రికా విలేకరుల మధ్యలో ఉన్నారు. ప్రశ్నపత్రం బయటకు వచ్చిన రెండు గంటల తర్వాత సంజయ్‌కి చేరింది.’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

‘‘ టీపీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీపై పోరాటం చేసింది బండి సంజయ్‌, భాజపా. లక్షలాదిమంది నిరుద్యోగులు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసి, ఆస్తులు అమ్మి, బంగారం అమ్మి, అప్పులు చేసి కోచింగ్‌ తీసుకున్నారు. ఎంతో ఆశతో గ్రూప్‌-1 పరీక్ష రాస్తే.. మీ చేతగానితనం, వైఫల్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయి. దానిపై భాజపా పోరాటం చేసింది. అక్రమ అరెస్టులతో ఈ రకమైన కుట్రలు చేయడం, మీడియా, రాజకీయ పార్టీల దృష్టి మళ్లించడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేసినంత మాత్రన భయపడే పార్టీ కాదు భాజపా. జైలు కెళ్లడానికి లక్షలాది మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎవరికీ ప్రశ్నించే హక్కులు లేకుండా చేశారు. కేసీఆర్‌ అవినీతిని భాజపా ప్రశ్నిస్తున్నందుకే అరెస్టులు చేస్తున్నారు. బండి సంజయ్‌ అరెస్టుపై న్యాయపోరాటంతో పాటు, రాజకీయంగా కూడా పోరాటం చేస్తాం. ప్రగతి భవన్‌ స్క్రిప్ట్‌ ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారు’’ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని