Kishan reddy: సర్వేలు చేసి.. ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నారు: కిషన్‌రెడ్డి

నిజామాద్‌ భాజపా ఎంపీ అర్వింద్‌ నివాసంపై జరిగిన దాడిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసానికి వెళ్లి మంత్రి  దాడి జరిగిన తీరును పరిశీలించారు.

Updated : 18 Nov 2022 20:07 IST

హైదరాబాద్‌: నిజామాబాద్‌ భాజపా ఎంపీ అర్వింద్‌ నివాసంపై జరిగిన దాడిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసానికి వెళ్లిన మంత్రి.. దాడి జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘అర్వింద్‌ నివాసంపై అధికార పార్టీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య. ఎంపీ ఇంటిపై దాడి జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు? రాజధాని నడిబొడ్డున ప్రముఖులు, రాజకీయ నాయకులు నివసించే ఎమ్మెల్యే కాలనీలోనే ఇలాంటి ఘటన జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం చేసుకోవచ్చు.

అధికార పార్టీ గూండాయిజానికి, రౌడీయిజానికి, అహంకారపూరితమైన పరిపాలనకు ఇదే నిదర్శనం. నిరాశ.. నిస్పృహలో, అభద్రతా భావంతో తెరాస దాడులకు పాల్పడుతోంది. వచ్చే ఏడాది అక్టోబరు వరకు సర్వేలు ఆపాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నా. సర్వేలు చేసి అభద్రతా భావంతో, ఓడిపోతామనే భయంతో ఇలాంటి దాడులు చేయిస్తున్నారు. పోలీసులు, మజ్లిస్‌ను అడ్డుపెట్టుకుని దాడులు చేస్తున్నారు. తెరాస దాడులకు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు. ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకోవాలనే కోరిక మాకు లేదు. భయపెట్టి, బతిమిలాడి పార్టీలో చేర్చుకునే అవసరం మాకు లేదు. ఊరికొక ఎమ్మెల్యే, మంత్రి కూర్చుంటేనే మునుగోడులో గెలిచారు. పార్టీ ఫిరాయింపుల కేసు పెట్టాలంటే మొదట కేసీఆర్‌ మీదే పెట్టాలి. ఆయన ఇప్పటికే ఎన్ని పార్టీల గొంతు నొక్కారో అందరికీ తెలుసు. దేశంలో ఇతర పార్టీల మెప్పు కోసమే కేసీఆర్‌ ప్రయత్నాలు. మోదీని ఢీకొంటున్నట్టు ఇతరులు అనుకోవాలనే ఈ చర్యలు’’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని