icon icon icon
icon icon icon

కూటమిలో కొత్త జోష్‌

కూటమి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం సభ జనసందోహంతో దద్దరిల్లింది. ప్రధాని మోదీ రాక ఎన్డీయే శ్రేణుల్లో మంచి జోష్‌ నింపింది. సభను విజయవంతం చేసేదిశగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోపాటు మూడు పార్టీల నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

Updated : 07 May 2024 10:15 IST

మోదీ రాకతో ఎన్డీయే శ్రేణుల్లో ఉత్సాహం

ఈనాడు-విశాఖపట్నం, అనకాపల్లి - ఎలమంచిలి, న్యూస్‌టుడే: కూటమి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం సభ జనసందోహంతో దద్దరిల్లింది. ప్రధాని మోదీ రాక ఎన్డీయే శ్రేణుల్లో మంచి జోష్‌ నింపింది. సభను విజయవంతం చేసేదిశగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోపాటు మూడు పార్టీల నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సోమవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా కశింకోట మండల పరిధిలోని తాళ్లపాలెం సమీపాన ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ అధ్యక్షత వహించారు. మోదీ ప్రసంగం అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ఉమ్మడి విశాఖ అసెంబ్లీ, ఉత్తరాంధ్ర ఎంపీ అభ్యర్థులను పరిచయం చేశారు. పేరుపేరునా వారి బలాబలాలను చెబుతూ, భారీ మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లు ఆశించిన మూడు పార్టీల ఆశావహులను వేదికపైకి పిలిపించి వారి త్యాగం గురించి వివరించారు. అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తానంటూ భరోసా ఇచ్చారు. ఎంతో నిబద్ధతతో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్న తీరు అన్నిచోట్లా స్ఫూర్తిదాయకమని అభినందించారు. చంద్రబాబు వేదికపైకి పిలిచిన వారిలో జిల్లా తెదేపా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, పార్టీ నేతలు పీలా గోవింద సత్యనారాయణ, గవిరెడ్డి రామానాయుడు, ప్రగడ నాగేశ్వరరావు, పైలా ప్రసాదరావు, పి.వి.జి.కుమార్‌ ఉన్నారు.

ప్రజాగళం సభలో మోదీ జగన్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. భాజపా అభివృద్ధి మంత్రంగా జపిస్తుంటే, రాష్ట్రంలో వైకాపా అవినీతి మంత్రం పఠిస్తోందన్నారు. ఇసుక, భూ, మద్యం మాఫియాలకు తెగబడిందని ఆరోపించారు. తండ్రి వై.ఎస్‌. రాజకీయ వారసత్వాన్ని జగన్‌ పుచ్చుకున్నారే కాని, ఆయన ఉత్తరాంధ్రలో చేపట్టిన సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారంటూ చురకలంటించారు. అంతకుముందు సభకు చంద్రబాబు చేరుకోగానే ఒక్కసారిగా ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలతో 5 నిమిషాలపాటు సభాప్రాంగణం హోరెత్తింది. అనకాపల్లి సభకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాకపోయినా, ఆయన గురించి చంద్రబాబు ఆద్యంతం ప్రశంసించడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. చివరిలో ‘హలో ఏపీ.. బైబై వైసీపీ’ అంటూ పవన్‌ నినాదం చంద్రన్న నోటినుంచి రావడంతో ఒక్కసారి సభా ప్రాంగణం దద్దరిల్లింది.

మూడు పార్టీల కార్యకర్తలను ఒక చోటకు చేర్చి సభకు తీసుకురావడంలో కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ సఫలమయ్యారు. సభ నిర్వహించిన తీరుపై ఏకంగా ప్రధాని మోదీ.. సీఎం రమేశ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

పింఛన్లు పెంచుతాం.. సకాలంలో జీతాలిస్తాం

మనదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపే సత్తా ప్రధాని మోదీకే ఉందని ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ అన్నారు. ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ మోదీ ఆలోచనలు భావితరాలకు పూలబాట వేస్తాయని, ఆయనను మరోమారు ప్రధానిని చేస్తేనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.

జగన్‌ భూ రాబందు: నాగబాబు

భూ రాబందులా తయారై రైతుల భూములను కాజేయడానికి జగన్‌ తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తామని జనసేన నేత కొణిదల నాగబాబు అన్నారు. రాష్ట్రంలో భూములన్నీ కబ్జా చేసి, రాక్షస పాలన సాగిద్దామని జగన్‌ చూస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img