icon icon icon
icon icon icon

విశాఖ తీరంలో కూటమి విజయవిహారమే!

జగన్‌ ఐదేళ్ల పాలనలో విశాఖ సాగర తీరం ఘోషిస్తూనే ఉంది. అది అల్పపీడనంలా ప్రారంభమై, వాయుగుండమై, తుపాను నుంచి ఉప్పెనలా మారబోతోంది. అధికార వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది. ప్రశాంత తీరమైన విశాఖను విధ్వంసం చేశారన్న ఆవేదన అడుగడుగునా వినిపిస్తోంది.

Updated : 07 May 2024 09:18 IST

లోక్‌సభ బరిలో కూటమి జోరు
అసెంబ్లీలో ఆరింట అదే ఉత్సాహం

ఈనాడు-విశాఖపట్నం, అమరావతి: జగన్‌ ఐదేళ్ల పాలనలో విశాఖ సాగర తీరం ఘోషిస్తూనే ఉంది. అది అల్పపీడనంలా ప్రారంభమై, వాయుగుండమై, తుపాను నుంచి ఉప్పెనలా మారబోతోంది. అధికార వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది. ప్రశాంత తీరమైన విశాఖను విధ్వంసం చేశారన్న ఆవేదన అడుగడుగునా వినిపిస్తోంది. విశాఖ పాలనా రాజధాని అన్న పాలకుడు నగరాన్ని అరాచక శక్తుల అడ్డాగా మార్చేశారు. భూకబ్జాలు, కిడ్నాప్‌లు, హత్యలు, దాడులు, డ్రగ్స్‌, గంజాయి విస్తృతితో విశాఖ అస్తిత్వాన్ని కొల్లగొట్టారు. యువతకు ఉపాధి ఏదని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని తెచ్చుకున్న స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యత్నాలను వైకాపా పాలకులు పట్టించుకోకపోవడాన్ని ప్రజానీకం సైతం జీర్ణించుకోలేకపోతోంది. 2019లో రాష్ట్రమంతటా ఫ్యాన్‌ గాలి వీచినా నగరంలోని 4 నియోజకవర్గాలు తెదేపా కంచుకోటల్లా నిలిచాయి. ఇప్పుడు విశాఖ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు నగరంలోని నాలుగు, ఆనుకుని ఉన్న మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి బలం చూపుతోంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో హోరాహోరీ పోరు సాగుతోంది. మిగిలిన ఆరింట కూటమి వైపు మొగ్గు కనిపిస్తోంది. తెదేపా బలానికి తోడు జనసేన, భాజపా కలిసి వస్తోంది.


శ్రీభరత్‌ దూకుడు

విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలో కూటమి మద్దతుతో రంగంలో దిగిన తెదేపా అభ్యర్థి శ్రీభరత్‌ దూసుకుపోతున్నారు. రాష్ట్రమంతటా పార్టీ వ్యతిరేక పవనాలు బలంగా వీచిన 2019లోనూ ఈయన కేవలం 4,414 ఓట్ల తేడాతోనే ఓటమిపాలయ్యారు. అప్పట్లో జనసేన విడిగా పోటీ చేయగా వి.వి.లక్ష్మీనారాయణ 2.88 లక్షల పైచిలుకు ఓట్లు సాధించారు. భాజపాకు 33 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు జనసేన, భాజపాలు మద్దతివ్వడమూ భరత్‌కు తిరుగులేని విజయాన్ని అందించబోతున్నాయి. ఇక్కడ స్టీల్‌ప్లాంట్‌, నేవీ, పోర్టు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు ఎక్కువ. వైకాపా నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు. గతంలో ఆమె విజయనగరం, బొబ్బిలి లోక్‌సభ స్థానాల నుంచి ఎంపీగా గెలిచారు. విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలో అత్యధిక ఓటర్లున్న యాదవ సామాజికవర్గానికి ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఇవ్వలేదు. దీంతో యాదవ సామాజికవర్గ నాయకులు చాలామంది వైకాపా నుంచి బయటికొచ్చేశారు. వీఎంఆర్డీఏ మాజీ ఛైర్మన్‌ అక్కరమాని విజయనిర్మల తెదేపాలో, వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్‌ జనసేనలో చేరిపోయారు. యువ ఓటర్లు జనసేన పొత్తుకు జై కొడుతున్నారు. శ్రీభరత్‌ యువకుడు కావడం, గీతం వర్సిటీ నిర్వహిస్తుండటంతో యువత మద్దతు దక్కుతోంది. వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వే జోన్‌, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, పోర్టు కాలుష్యానికి స్మార్ట్‌ టెక్నాలజీతో కళ్లెం వేయడం, విశాఖ నగరాన్ని మళ్లీ ప్రశాంత ప్రాంతంగా తీర్చిదిద్దడం, ఆనందపురం - అగనంపూడి వరకు 4 ఫ్లైఓవర్ల నిర్మాణం, పెందుర్తి నుంచి అరకు వరకు నాలుగు వరుసల రహదారి, ఐటీ పారిశ్రామిక రంగాలపై దృష్టి అంటూ సప్త హామీలతో శ్రీ భరత్‌ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కూటమి నాయకులంతా కలిసికట్టుగా పనిచేయడం కలిసొస్తోంది. భరత్‌ భార్య, సినీనటుడు బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని ప్రచారమూ ఆకట్టుకుంటోంది. వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ.. తెదేపా అభ్యర్థి స్థానికేతరుడన్న నినాదం తేవడానికి ప్రయత్నించారు. విజయనగరంలో పుట్టి, అక్కడే మెట్టిన ఝాన్సీ స్థానికురాలా? కడప నుంచి విజయమ్మను తెచ్చి విశాఖ నుంచి పోటీ చేయించలేదా అనే ప్రశ్నలతో స్థానికేతర అస్త్రం ఎదురుతిరిగింది. విశాఖ ఉక్కు సమస్యను జగన్‌ పట్టించుకోకపోవడం ప్రతిబంధకమయింది. మూడేళ్ల తర్వాత జగన్‌ కార్మిక సంఘ నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చి విశాఖ ఉక్కుకు హామీ ఇవ్వకపోగా.. స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల్లో ఉందా అని ప్రశ్నించడంతో కార్మిక కుటుంబాలు మండిపడుతున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ తాను పోటీ చేస్తున్న చీపురుపల్లి అసెంబ్లీని వదిలివచ్చి మరీ విశాఖలోనే కూర్చుని భార్య విజయానికి పావులు కదుపుతున్నా, కాపు సామాజికవర్గంతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నా ఫలితం కనిపించడం లేదు. విశాఖ నగరంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు భీమిలి, శృంగవరపుకోట, గాజువాక ఈ లోక్‌సభ నియోజకవర్గంలోకి వస్తాయి. గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఎదురీదుతున్నారు. సొంత ప్రాంతాన్ని పట్టించుకోలేదనే కోపం ఇక్కడ ఉంది. ప్రత్యర్థి పల్లా శ్రీనివాసరావు మొదటి నుంచి స్థానికుల్లో మంచి ముద్ర వేసుకున్నారు. ఆయనను పార్టీ మార్పించేందుకు వైకాపా ఆయన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను కూలగొట్టించినా బెదరకుండా పోరాడారు.


ఆ డివైడర్‌ రాళ్లే.. వైకాపా ఓటమికి పునాదిరాళ్లు

నియోజకవర్గం: విశాఖ తూర్పు

విశాఖ తూర్పు నుంచి హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన వెలగపూడి రామకృష్ణబాబు మరోసారి గెలుపు వాకిట్లో ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవారికోసం ఆయన కార్యాలయ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఫోన్లోనూ ఆయనతో మాట్లాడే ఆస్కారం ప్రజలకు ఉంది. ఒక సమస్య పరిష్కారమయ్యే వరకు వాకబు చేస్తుంటారు. ఉదయం ద్విచక్రవాహనంపై ప్రజల్లో తిరుగుతారు. అందుకే ప్రజలు ఆయనను బుల్లెట్‌ బాబు, మీసాలబాబు అని పిలుస్తుంటారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక ముద్ర వేశారు. పెదజాలరిపేటలో యూజీడీ వ్యవస్థ తెచ్చారు. ఇండోర్‌ స్టేడియం నిర్మించారు. గెడ్డల ఆధునికీకరణ పనులు చేయించారు. సామాజిక భవనాలు కట్టించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తూర్పు నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నగరాభివృద్ధిపై ఎలాంటి ముద్ర వేయకపోగా రియల్టర్‌గా ఆయనపై ఎన్నో స్థల ఆక్రమణల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నగరంలో టైకూన్‌ కూడలి మూసివేయడానికి ఆయనే కారణమంటారు. విశాఖలో కీలకమైన రహదారికి అడ్డుగా వేసిన డివైడర్‌ రాళ్లు ఎంవీవీ ఓటమికి పునాదిరాళ్లుగా మారుతున్నాయి. రాళ్లే తీయించలేని అభ్యర్థి మాకేం చేస్తారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నోట్లకట్టలు ఓట్లు తెచ్చిపెడతాయని ఆశిస్తున్నా అవేవీ ఫలించేలా లేవు.


హోరాహోరీ నుంచి వంశీ వైపు..

నియోజకవర్గం: విశాఖ దక్షిణ

విశాఖ దక్షిణ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ పోటీపడుతున్నారు. వైకాపాలో అవమానాలు తట్టుకోలేక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చారు. తూర్పు నియోజకవర్గంలో పట్టున్న వంశీ దక్షిణ నియోజకవర్గంలో బరిలోకి దిగారు. మొదట ఇక్కడ పోరు హోరాహోరీగా ఉన్నా తర్వాత అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడ తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్న గండి బాబ్జీ పూర్తి సహకారం, వైకాపా నుంచి బయటకు వచ్చిన బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ కలయికతో జోష్‌ పెరిగింది. మత్స్యకారులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇటీవల బోట్లు దగ్ధమైతే తొలుత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించి రూ.50 వేల చొప్పున సాయం అందించడం ఆ వర్గం వారు మొగ్గుచూపడానికి కారణమవుతోంది. కూటమి క్యాడర్‌తో కలిసి వంశీ ప్రచారానికి ఊపు తెచ్చారు. వైకాపా అభ్యర్థిగా వాసుపల్లి గణేష్‌కుమార్‌ బరిలో ఉన్నారు. తెదేపా నుంచి గెలిచిన ఆయన స్వప్రయోజనాల కోసం వైకాపాలోకి వెళ్లారు. ఆ పార్టీలో కార్పొరేటర్లతో విభేదాలు ఆయనకు పెద్ద మైనస్‌. సేవ ముసుగులో రూ.250 కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు, సొంత స్థలాలకు రోడ్లు వేయించుకోవడం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదనే ఆగ్రహం, మత్స్యకార నాయకుల అసంతృప్తి వాసుపల్లికి ప్రతికూలంగా మారాయి.  


హ్యాట్రిక్‌ విజయం కోసం గణబాబు

నియోజకవర్గం: విశాఖ పశ్చిమ

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తెదేపా అభ్యర్థి పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు) హ్యాట్రిక్‌పై కన్నేశారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌, తటస్థ ఓటర్లను అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన దిట్ట. 2014-19 మధ్య తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పనులను చెబుతూ ప్రచారం చేస్తున్నారు. గోపాలపట్నం, ములగాడలో తహసీల్దార్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయించారు. ములగాడలో మూతపడిన రైతుబజార్‌ తెరిపించారు. గోపాలపట్నం ఇండోర్‌ స్టేడియం, మల్కాపురంలో గెడ్డ కాల్వ ఆధునికీకరణ చేయించారు. వైకాపా అభ్యర్థిగా విశాఖ డెయిరీ ఛైర్మన్‌ ఆడారి ఆనంద్‌ పోటీపడుతున్నారు. స్థానికేతరుడైనా ఏడాదిన్నర నుంచి నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అర్హత ఉండి సాంకేతిక సమస్యలతో పింఛన్లు అందనివారిని గుర్తించి, సొంత నిధులతో పింఛన్లు అందజేస్తున్నారు. గణబాబు, ఆనంద్‌ బంధువులే కావడం, నియోజకవర్గంలో బలమైన గవర సామాజికవర్గం నుంచి పోటీపడుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.  


భారీ మెజారిటీపై గంటా కన్ను

నియోజకవర్గం: భీమిలి

రాష్ట్రంలో అత్యధిక ఓటర్లున్న భీమునిపట్నం (భీమిలి) నుంచి కూటమి తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు. వరుస విజయాలతో గెలుస్తున్న గంటాకు భీమిలిలో మంచి పట్టుంది. పద్మనాభం, ఆనందపురం, భీమునిపట్నంలోని సాంప్రదాయ తెదేపా ఓటర్ల మద్దతు ఉంది. 2014 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పనులను ఇప్పటికీ స్థానికులు గుర్తు చేసుకోవడం కలిసొస్తుంది. గంటాను భీమిలి అభ్యర్థిగా ప్రకటించడంతో పాత క్యాడర్‌ అంతా తిరిగి వచ్చింది. కొన్ని రోజుల్లోనే 10 వేల మంది వైకాపా నుంచి తెదేపాలోకి చేరారు. భీమిలిలో గెలుపు నల్లేరుపై నడకే కావడంతో భారీ మెజారిటీపై గంటా కన్నేశారు. వీఎంఆర్డీఏ మాజీ ఛైర్మన్‌ తెదేపాలోకి రావడం మరింత కలిసొస్తుంది. ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైకాపా అభ్యర్థిగా పోటీపడుతున్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యేపై ముఖ్యనాయకులు, క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. అధికారులు, సామాన్యులు ఆయన నోటి దురుసు, వేధింపులకు భయపడిపోయారు.  


ఊపందుకుంటేనే కమల వికాసం

నియోజకవర్గం: విశాఖ ఉత్తరం

కూటమి అభ్యర్థిగా భాజపా నుంచి విష్ణుకుమార్‌రాజు బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లో కూటమిలో భాజపా తరఫున ఇక్కడి నుంచే పోటీ చేసి, గెలిచారు. ఈ మూడు పార్టీల క్యాడర్‌ను పూర్తిస్థాయిలో ఏకం చేసి అడుగులు వేస్తే కలిసొస్తుంది. ప్రచారంలో ఇంకా జోష్‌ పెరగాల్సి ఉంది. ఉత్తర నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా కేకే రాజు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో గెలవనప్పటికీ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజల్లో ‘ఎమ్మెల్యే కేకే రాజుగా’ ముద్ర వేసుకున్నారు. చుట్టూ రౌడీషీటర్లను బౌన్సర్లుగా పెట్టుకుని కె.కె.రాజు హడావుడి చేయడం స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. సొంత లేఔట్ల కోసం వుడా మాస్టర్‌ ప్లాన్‌నే మార్చారు. నియోజకవర్గ పరిధిలోని 15 మంది వైకాపా కార్పొరేటర్లలో సగం మందికి పైగా కేకే రాజు తీరుపై అసంతృప్తిగా ఉండటం ప్రతికూలాంశం.


లలితకుమారికే కోట ‘ఎస్‌’ అంటోంది!

నియోజకవర్గం: శృంగవరపుకోట

తెదేపా అభ్యర్థి కోళ్ల లలితకుమారి 2009, 2014ల్లో రెండుసార్లు ఇక్కడి నుంచి  ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తాతయ్య కోళ్ల అప్పలనాయుడు ఏడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. బలమైన ఓటు బ్యాంకు ఉంది. తెదేపా ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు, అందరినీ కలుపుకొనిపోవడం ఆమెకు అనుకూలతలు. కూటమి తరఫున టికెట్‌ కోసం పోటీపడిన ఎన్‌ఆర్‌ఐ గొంప కృష్ణ వర్గాన్ని వెంటబెట్టుకుని తిరగాల్సి ఉంది. వైకాపా అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును సొంత పార్టీలోనే వ్యతిరేకత కంగారుపెడుతోంది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వర్గం పూర్తిగా విభేదించింది. ఆయన తప్ప, కుటుంబసభ్యులంతా తెదేపాలో చేరారు. కడుబండికి క్యాడర్‌పై పట్టు లేదు.అవినీతి ఆరోపణలు ప్రభావం చూపబోతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img