Congress: రైతులకు 5 హామీలతో కాంగ్రెస్‌ ‘కిసాన్‌ న్యాయ్‌’

లోక్‌సభ ఎన్నికల వేళ రైతులకు కాంగ్రెస్‌ పార్టీ కీలక హామీలు ప్రకటించింది. 

Published : 14 Mar 2024 22:07 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) దగ్గరపడుతున్న వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ (Congress) హామీల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే నిరుద్యోగులు, మహిళలకు హామీలు ప్రకటించిన ‘హస్తం’ పార్టీ.. తాజాగా ‘కిసాన్‌ న్యాయ్‌’ (Kisn Nyay Gurantee) పేరిట రైతులకు ఐదు హామీలు ఇచ్చింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ ఎత్తివేత, రైతుల కోసం శాశ్వత రుణమాఫీ కమిషన్‌ ఏర్పాటు, పంటల బీమా సొమ్ము 30 రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం, రైతులకు న్యాయం జరిగేలా కొత్త ఎగుమతి, దిగుమతుల విధానం అమలుచేస్తామని భరోసా ఇచ్చింది.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: మాజీ మంత్రి మల్లారెడ్డి

జవాన్‌, కిసాన్‌లను రక్షించుకోకపోతే దేశం పురోగమించదు.. రాహుల్‌

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా చంద్వాడ్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ కూటమిని గెలిపిస్తే రైతులకు రక్షణ కల్పించే విధానాలను రూపొందించి వారికి గొంతుకగా ఉంటామన్నారు. జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పిస్తామన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వం తలుపులు రైతులకు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని కేవలం 20 నుంచి 25 మందికి దేశ జనాభాలో 70 కోట్ల మందికి సమానమైన సంపద ఉందన్నారు. మోదీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రూ.16లక్షల కోట్లు మాఫీ చేసిందని రాహుల్‌ విమర్శించారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో రైతులకు రూ.70వేల కోట్లు రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మన దేశ సరిహద్దులను కాపాడే సైనికుల్లాగే.. రైతులు కూడా దేశంలోని పౌరులను కాపాడుతున్నారన్నారు. అలాంటి సైనికులు, అన్నదాతలను కాపాడుకోలేకపోతే దేశం పురోగమించదని చెప్పారు.

రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడిద్దాం: పవార్‌

కేంద్రంలోని మోదీ సర్కార్‌ రైతులు, వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ (ఎస్‌పీ) నేత శరద్‌ పవార్‌ విమర్శించారు. రైతులు పండించిన పంటలకు సరైన ధర లేకపోవడంతో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారన్నారు. యూపీఏ ప్రభుత్వం రైతులకు రూ.70వేల కోట్లు రుణమాఫీ చేసిందని.. ద్రవ్యోల్బణాన్ని ఆహ్వానిస్తోన్న రైతు వ్యతిరేక, యువజన వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడం అందరి సమష్టి బాధ్యత అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని