KTR: మార్చి 1 నుంచి భారాస చలో మేడిగడ్డ : కేటీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు.. మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనునట్లు మాజీ మంత్రి, భారాస నేత కేటీఆర్‌ తెలిపారు.

Published : 27 Feb 2024 12:25 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు.. మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనునట్లు మాజీ మంత్రి, భారాస నేత కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘‘కాంగ్రెస్‌ గతంలో చేపట్టింది జలయజ్ఞం కాదు.. ధనయజ్ఞం. కేంద్రం, ఏపీ, మహారాష్ట్రలోనూ ఆ పార్టీ గతంలో అధికారంలో ఉన్నా ప్రాజెక్టుల కోసం అనుమతులు తీసుకురాలేదు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని కేంద్ర జలసంఘం చెప్పింది. అక్కడి కంటే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువ. అందుకే కాళేశ్వరం ప్రారంభించాం. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రతో ఉన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాం. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదు.. 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌజ్‌లు, 201 కిలోమీటర్ల సొరంగాలు. 88 మీటర్ల నుంచి 618 మీటర్లకు నీటిని లిఫ్ట్‌ చేశాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మించాం. కాళేశ్వరం జలాలతో వాగులు, చెరువులనూ నింపాం. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. కాళేశ్వరం వల్ల పాతాళగంగ పైకి వచ్చింది’’

‘‘మేడిగడ్డలో 84 పిల్లర్లు ఉంటే 3 కుంగిపోయాయి. బ్యారేజీ మొత్తం కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారు. గతంలో ఫరక్కా బ్యారేజీలోనూ ఇలా జరిగింది. 1957లో కడేం ప్రాజెక్టే కొట్టుకుపోయింది. ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయి. కాఫర్‌ డ్యామ్‌ కట్టి మేడిగడ్డకు మరమ్మతులు చేయవచ్చు. 2 నెలల్లో  మేడిగడ్డకు మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వవచ్చు. సీఎం తీరు చూస్తే కాళేశ్వరంపై కుట్ర చేస్తున్నారని అనిపిస్తుంది. మార్చి 1 నుంచి భారాస చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనుంది. 150 నుంచి 200 మంది పార్టీ ప్రతినిధులతో అక్కడికి వెళ్తున్నాం. తెలంగాణ భవన్‌ నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా తొలి రోజు కాళేశ్వరం వెళ్తాం. ఈ ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెట్టి.. వాస్తవాలు తెలియజేస్తాం’’ అని కేటీఆర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని