ఆది గోద్రేజ్‌ కుటుంబం విడిపోయింది

సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్‌ గ్రూప్‌ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు.

Published : 01 May 2024 06:51 IST

ఆది గోద్రేజ్‌, నదిర్‌లకు నమోదిత కంపెనీలు
జెంషెడ్‌, స్మిత చేతికి నమోదు కాని సంస్థలు

దిల్లీ: సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్‌ గ్రూప్‌ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. ఆది గోద్రేజ్‌(82), ఆయన సోదరుడు నదిర్‌(73)లు 5 నమోదిత కంపెనీలు ఉన్న గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ను తీసుకుంటారు. వారి దాయాదులైన జెంషెడ్‌ గోద్రేజ్‌(75), స్మితా గోద్రేజ్‌ క్రిష్ణ(74)లకు నమోదు సంస్థ(అన్‌లిస్టెడ్‌) కాని గోద్రేజ్‌ అండ్‌ బోయ్స్‌తో పాటు దాని అనుబంధ సంస్థలు, ముంబయిలోని 3400 ఎకరాల విలువైన భూమితో పాటు ఇతర భూములు దక్కుతాయని గ్రూప్‌ తెలిపింది. దీని ప్రకారం..

  • గోద్రేజ్‌ అండ్‌ బోయ్స్‌, అనుబంధ కంపెనీలు గల గోద్రేజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌నకు ఛైర్‌పర్సన్‌, ఎండీగా జెంషెడ్‌ గోద్రేజ్‌ నియమితులవుతారు. ఆయన సోదరి స్మితా కుమార్తె నైరికా హోల్కర్‌(42) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉంటారు.
  • గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌, గోద్రేజ్‌ అగ్రోవెట్‌, ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌.. వంటి నమోదిత కంపెనీలుండే గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌నకు ఛైర్మపర్సన్‌గా నదిర్‌ గోద్రేజ్‌ ఉంటారు. ఆది, నదిర్‌, వారి కుటుంబాలకు నియంత్రణ ఉంటుంది. ఆది కుమారుడు పిరోజ్‌షా గోద్రేజ్‌(42) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉంటారు. 2026 ఆగస్టులో నదిర్‌ నుంచి ఛైర్‌పర్సన్‌ బాధ్యతలు ఆయన తీసుకుంటారు. ఇరు గ్రూప్‌లు గోద్రేజ్‌ బ్రాండ్‌ను వినియోగించుకుంటాయి. 1897లో ఆర్దేశిర్‌ గోద్రేజ్‌, ఆయన సోదరుడు పిరోజ్‌షా కలిసి ఈ కంపెనీని స్థాపించారు. అయితే ఆర్దేశిర్‌కు పిల్లలు లేరు. పిరోజ్‌కు వారసులు(సౌహ్రబ్‌, దోసా, బుర్జోర్‌, నావల్‌) ఉన్నారు. బుర్జోర్‌(ఆది, నదిర్‌), నావల్‌(జెంషెడ్‌, స్మిత) పిల్లలే ఇపుడు గ్రూప్‌ను నడుపుతున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని