logo

వడదెబ్బ చికిత్సలకు.. హీట్‌స్ట్రోక్‌ క్లినిక్‌లు

ఎండలు మండిపోతున్నాయి. నిత్యం 40-42 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 11 మంది మృత్యువాత పడ్డారు.

Updated : 01 May 2024 07:03 IST

గాంధీ, ఉస్మానియాల్లో అత్యవసర సేవలు

బేగంపేటలోని మెడికవర్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హీట్‌స్ట్రోక్‌ ఉచిత క్లినిక్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎండలు మండిపోతున్నాయి. నిత్యం 40-42 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు ఇలాంటి కేసులు వస్తే...వెంటనే ఏఎంసీలో ప్రత్యేక చికిత్సలు అందించాలని ఆదేశించింది. చికిత్సలకు సంబంధించి ఆయా ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. వడదెబ్బతో వచ్చిన రోగులకు ఏఎంసీకు తరలించి అత్యవసర చికిత్సలు అందిస్తామని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తెలిపారు. అంతేకాక కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు వడదెబ్బ బారినపడిన వారికి చికిత్సలు అందించేందుకు ప్రత్యేకంగా హీట్‌స్ట్రోక్‌ ఉచిత క్లినిక్‌లు అందుబాటులోకి తెస్తున్నాయి. వృద్ధులు, పిల్లలు, గర్భిణీల్లో ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది.

లక్షణాలు ఇలా....: సాధారణంగా కొన్ని లక్షణాలను బట్టి వడదెబ్బగా గుర్తించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు వడదెబ్బ బారిన పడే ముప్పు ఉంటుంది. శరీరంలోని నీరంతా చమట రూపంలో బయటకు పోతుంది. ముఖ్యంగా  అలసట, తలనొప్పి, తల తిరగడం, వేగంగా గుండె కొట్టుకోవడం, వికారం, పాలిపోయిన చర్మం వంటి లక్షణాలు కన్పిస్తాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించక పోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తొలుత రోగిని నీడ ప్రాంతానికి తరలించాలి. చల్లని నీటితో స్పాంజ్‌, ఐస్‌ ప్యాక్‌లతో నుదురు, మెడపై ఉంచి చల్లని టవల్‌తో శరీరాన్ని తుడవాలి. అపస్మారక స్థితిలోకి చేరుకుంటే ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి.


నిర్లక్ష్యం చూపితే... ప్రమాదమే

వడదెబ్బ విషయంలో నిర్లక్ష్యం చూపితే ప్రాణాలకే ప్రమాదం. ఎక్కువ ఆయిల్‌తో కూడిన ఆహారానికి దూరంగా ఉండాలి.  టీ, కాఫీలు తగ్గించాలి. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఈ కాలంలో దొరికే కర్బుజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజులు వంటి సీజన్‌ పండ్లను తీసుకోవాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడతాయి. కొబ్బరి నీళ్లు మేలు చేస్తాయి. మజ్జిగ అన్నంతో కలిపి మామిడి పండ్లను తీసుకోవడం వల్ల విటమిన్‌ ఏ, డి శరీరానికి అధిక శాతం అందుతాయి. రోజుకు కనీసం 3-4 లీటర్లు నీళ్లు తీసుకోవాలి. వడదెబ్బ లక్షణాలు కన్పిస్తే...వెంటనే చికిత్స అందించడం అవసరం.

డా.రాజేష్‌ ఉక్కాల, జనరల్‌ ఫిజిషియన్‌, మెడికవర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని