KTR: ‘రైతుబంధు’ కేసీఆర్‌ మానస పుత్రిక: కేటీఆర్‌

రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సంబురాలు జోరుగా సాగుతున్నాయని.. సంక్రాంతి వరకు వాటిని కొనసాగించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు,

Updated : 10 Jan 2022 13:50 IST

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సంబురాలు జోరుగా సాగుతున్నాయని.. సంక్రాంతి వరకు వాటిని కొనసాగించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రైతుబంధు సంబురాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లుగా రాష్ట్రంలో సంబురాలు జరుగుతున్నాయని.. వివిధ రూపాల్లో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతుబంధు పథకం సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక అని కేటీఆర్‌ అన్నారు. ఈ పథకం కింద 64లక్షల మందికి రూ.50వేల కోట్ల పెట్టుబడి సాయం అందించామని మంత్రి వివరించారు.

తెరాస అంటేనే రైతు సర్కార్‌..

‘‘రాష్ట్రంలో 64లక్షల మంది రైతులకు కేసీఆర్‌ బాసటగా నిలిచారు. తెరాస అంటేనే రైతు సర్కార్‌గా పేరు తెచ్చుకుంది. కొంతమంది పొలిటికల్‌ టూరిస్టులు ఏవేవో మాట్లాడుతున్నారు. రైతుబంధు దేశంలోనే ఎక్కడా లేనిది. రూ.50వేల కోట్లు రైతుల ఖాతాలో జమయ్యాయి. తెలంగాణ ఏర్పడక ముందు రైతులు దయనీయ స్థితిలో ఉన్నారు. బోర్లు వేసి అప్పుల పాలయ్యారు. ఓ రైతుకు ఏకంగా బోర్ల రాంరెడ్డి అనే పేరు కూడా వచ్చింది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 10 ఎకరాల రైతు కూడా బతుకుదెరువు కోసం పట్టణాలకు వచ్చారు. గతంలో రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ మొదటి స్థానం.. పంటల దిగుబడిలో చివరి స్థానంలో ఉండేది. ఉమ్మడి పాలనలో ఎంతమంది పాలకులు మారినా రైతుల పరిస్థితి మారలేదు. గతంలో తెలంగాణలో భూమికి విలువ లేదు.. రైతుకు బతుకు లేకుండా ఉండేది. పాలమూరు జిల్లా నుంచి 15లక్షల మంది వలస వెళ్లేవాళ్లు. కరెంట్‌ అడిగితే కాల్పులు జరిగాయి.

రైతు రుణమాఫీ చేస్తాం..

ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూగర్భ జలాలు పెరిగాయి. భూగర్భ జలాల నిర్వహణపై ఐఏఎస్‌ శిక్షణాధికారులకు తెలంగాణ కేంద్రంగా మారింది. భూమి ధర పెరగడంతో రైతు దర్జాగా బతుకుతున్నాడు. స్థిరాస్తి వ్యాపారం దేశమంతా ఒక రీతిలో ఉంటే.. స్థిరమైన పాలనతో రాష్ట్రంలో అద్భుతంగా ఉంది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యలు తగ్గించడంలో రాష్ట్రం ముందుంది. తెలంగాణ కోటి రతనాల వీణే కాదు.. ముక్కోటి ధాన్యాలు పండిస్తున్న రాష్ట్రం. కేసీఆర్‌ పెద్ద రైతుగా అండగా ఉంటున్నారు. అన్నమో రామచంద్రా అనే స్థాయి నుంచి దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగింది. ఎఫ్‌సీఐ కూడా కొనలేనంత ధాన్యం తెలంగాణలో పండుతోంది. కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలను చూసి మోదీ కూడా ఫాలో అవుతున్నారు. తెలంగాణలో చేపడుతున్న కార్యక్రమాలు దేశంలోనూ అమలవుతున్నాయి. మాటలతో కోట కట్టడం కాకుండా చేతలతో రైతుల జేబులు నింపిన ఘనుడు కేసీఆర్‌. 2014కి ముందు ఉన్న ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా పూర్తిగా చెల్లించిన ఘటన ఆయనది. రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేస్తాం. ప్రపంచమే అబ్బురపడే విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మించింది’’ అని కేటీఆర్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని