TS News: 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోతే పోరాటమే: కేటీఆర్‌

హైదరాబాద్ ప్రజలు తెలివిగా ఆలోచించి కాంగ్రెస్‌కు ఒక్క సీటు ఇవ్వకుండా 16 సీట్లు తమకే ఇచ్చారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

Published : 27 Feb 2024 21:36 IST

ఇబ్రహీంపట్నం: ‘‘హైదరాబాద్ ప్రజలు తెలివిగా ఆలోచించి కాంగ్రెస్‌కు ఒక్క సీటు ఇవ్వకుండా 16 సీట్లు మనకే ఇచ్చారు. కానీ, నగరానికి పక్కనే ఉన్న నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి వారికి ఓట్లు వేశారు’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) వ్యాఖ్యానించారు. తుర్కయాంజల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ఓ గార్డెన్‌లో నిర్వహించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ భారాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘కాంగ్రెస్‌ నేతలు అభయహస్తం, డిక్లరేషన్‌ అంటూ అన్ని కలిపి 420 హామీలు ఇచ్చారు. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామన్నారు. ఇప్పుడు ఇంటికి ఒక్కటే అంటున్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలు రాష్ట్రంలో 1.67 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ ఈ పథకం వర్తించాలి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాటం చేయాలి. పోయింది అధికారం మాత్రమే.. పోరాట పటిమ కాదు. భువనగిరి పార్లమెంట్‌ సీటు 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఈసారి అక్కడ విజయం సాధించాలి. ఇందుకోసం మనమంతా కసిగా పనిచేయాలి. పోలీసు కేసులు పెడతారు.. అయినా భయపడవద్దు. మీకోసం అందరం వచ్చి పోరాడతాం’’ అని కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్‌ అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, భారాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని