YSRCP: వైకాపాకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా

అధికార వైకాపాలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Updated : 13 Jan 2024 20:33 IST

అమరావతి: అధికార వైకాపాలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అసంతృప్తిగా ఉన్న బాలశౌరి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రెండ్రోజుల్లో ఆయన జనసేనలో చేరే అవకాశముందని సమాచారం. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపినట్టు ఎంపీ తెలిపారు. గుంటూరులోని నివాసంలో ఉన్న బాలశౌరిని జనసేన నేతలు గాదె వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాస్‌ కలిశారు. పార్టీలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. రాజీనామా విషయం తెలుసుకున్న ఎంపీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.

ఎమ్మెల్యేలతో విభేదాలే కారణమా?

ఎంపీ బాలశౌరికి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్‌కు మధ్య విభేదాలున్నాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం జరిగినా ఎంపీని దూరం పెడుతున్నారు. గతంలో మచిలీపట్నం పర్యటన సందర్భంగా ఎంపీని.. పేర్ని నాని వర్గీయులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ క్రమంలో పేర్ని నానిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ పేర్ని నాని.. బందరు నీ అడ్డా కాదు. నీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నన్ను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారు. ఇకపై బందరులోనే ఉంటా.. కార్యక్రమాల్లో పాల్గొంటా. ఎవరేం చేస్తారో చూస్తా. ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా’’ అని బహిరంగంగా వార్నింగ్‌ ఇచ్చారు.

పేర్ని నానిని మంత్రివర్గం నుంచి తొలగించడానికి బాలశౌరి కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. అలాగే మంత్రి జోగి రమేష్‌, బాలశౌరికి మధ్య వర్గపోరు నడుస్తోంది. దీంతో ఆయన పెడన నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రతి నియోజకవర్గంలోనూ ఎంపీ ఒక గ్రూపును తయారు చేసుకున్నారని ఆరోపణలున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ ఎదుటే ఆయన ముఖ్య అనుచరుడిపై స్థానిక ఎమ్మెల్యే, వైకాపా శ్రేణులు దాడికి దిగారు. దీనికి తోడు అధిష్ఠానం మద్దతు కూడా బాలశౌరికి లభించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పు నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని