Telangana News: నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వీకరిస్తాం: హరీశ్‌రావు

కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ ఇవాళ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రం, ఆర్‌బీఐ లెక్కలే రాష్ట్ర అభివృద్ధిని చెప్తున్నాయన్నారు.

Updated : 09 Mar 2022 16:37 IST

హైదరాబాద్‌: కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ ఇవాళ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రం, ఆర్‌బీఐ లెక్కలే రాష్ట్ర అభివృద్ధిని చెప్తున్నాయన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11.54 లక్షల కోట్లకు చేరిందని.. ప్రజల తలసరి ఆదాయం రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని హరీశ్‌రావు వెల్లడించారు.

‘‘కాంగ్రెస్‌ పార్టీ గాంధీ పేరు చెప్పుకొని 50 ఏళ్లు ఓట్లు వేయించుకుంది. గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని మాత్రం కాంగ్రెస్‌ సాధించలేదు. కాంగ్రెస్‌ పార్టీ 60 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని మేం 6 ఏళ్లలో సాధించాం. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే మేం స్వీకరిస్తాం. తాగునీరు, విద్యుత్‌ రావట్లేదని ప్రతిపక్షాలు అడగట్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి. పంటలు ఎండిపోయాయని ఎవరూ అడగట్లేదంటే అర్థం చేసుకోవాలి. ప్రతి గ్రామంలో నర్సరీలు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశాం. గతంలో ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్‌లోనూ కరెంట్‌ ఉండేది కాదు. తెలంగాణ వచ్చేనాటికి 7,750 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే ఉంది. ఇప్పడు 17,800 మెగావాట్ల విద్యుత్‌ అందిస్తున్నాం. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చి తాగునీటి సమస్యను పరిష్కరించాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కోసం రూ.9వేల కోట్లు, కేసీఆర్‌ కిట్‌ కోసం రూ.1700 కోట్లు, రైతుబంధు కోసం రూ.54వేల కోట్లను ఖర్చు చేశాం. ఇవాళ రైతుబంధును కేంద్రం, మరికొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో రైతులు బోర్లు వేసి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా అమలు చేస్తున్నాం’’ అని హరీశ్‌రావు తెలిపారు.

మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు..

‘‘రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు. మీటర్లు పెడితేనే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం చెబుతోంది. మీటర్లు పెడితే ఇచ్చే ప్రోత్సాహకాలు వద్దన్నాం. రైతుల ఉసురుపోసుకుంటేనే వచ్చే ప్రోత్సాహకాలు వద్దని చెప్పాం. కేంద్రం పెట్టే కండీషన్లకు కొన్ని రాష్ట్రాలు ఒప్పుకొని ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచుకున్నాయి. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం ఉండదు. అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో తెలుంగాణ చివరి నుంచి ఐదో స్థానంలో ఉంది. మన కంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు 23 ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంకు పరిమితికి లోబడే తెలంగాణ అప్పులున్నాయి. ఇటీవల కేంద్రం అవలంబిస్తోన్న విధానాల వల్లే రాష్ట్రాల అప్పులు పెరిగాయి’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని