Kishan Reddy: భారాస నేతల అక్రమాలకు బంగారు గని బలైపోతోంది: కిషన్‌రెడ్డి

సింగరేణి సంస్థలో సీఎం కుటుంబం, భారాస నేతల జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా, టెండర్లు వేయకుండా తమ బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు.

Published : 19 Apr 2023 16:31 IST

హైదరాబాద్‌: కార్మికుల కష్టార్జితంతో కొనసాగుతున్న సింగరేణి సంస్థను భారాస సర్కార్‌ భక్షించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబం, భారాస నేతల అక్రమాలకు తెలంగాణ బంగారు గని బలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొనలేని రాష్ట్ర ప్రభుత్వం.. సింగరేణి సొమ్మును విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబడులు పెడతామని చూస్తే కార్మికులు సహించబోరని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.  ఈమేరకు దిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘తెలంగాణ ఉద్యమంలో సింగరేణిని సాధించు, రక్షించు అనే నినాదాన్ని కేసీఆర్‌ తీసుకున్నారు. కానీ, ఈరోజు భక్షించే విధానాన్ని అమలు చేస్తున్నారు. 2014లో రూ.3,500 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌తో సింగరేణి కొనసాగేది. ప్రస్తుతం సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ.10వేల కోట్లు దాటింది. భారాస చేతకాని తనంతో సింగరేణి అప్పులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సంస్థలో సీఎం కుటుంబం, భారాస నేతల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. తెలంగాణలో బొగ్గు గనుల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనట్లేదు. టెండర్లు కూడా వేయకుండా తమ బాధ్యతను విస్మరించారు’’ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని