Modi: గుజరాత్‌ ఓటింగ్‌.. వివాదంలో మోదీ ‘నడక’

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ.. పోలింగ్‌ కేంద్రానికి నడుచుకుంటూ వెళ్లడం వివాదానికి దారితీసింది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది.

Updated : 05 Dec 2022 15:56 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) రెండో విడత పోలింగ్‌ సోమవారం కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi) ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటేసేందుకు వచ్చిన ప్రధాని.. కొద్ది దూరం నడుచుకుంటూ పోలింగ్  కేంద్రానికి వెళ్లడంపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పోలింగ్‌ (Gujarat Polling) వేళ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మోదీ ‘రోడ్‌ షో’ చేపట్టారని ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) మౌనంగా ఉండటం విచారకరమని విమర్శించింది.

ఈ ఉదయం అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఆ సమయంలో తన కాన్వాయ్‌ నుంచి దిగిన మోదీ (Modi).. పోలింగ్‌ కేంద్రం వరకు నడుచుకుంటూ వెళ్లారు. ప్రధానిని చూసేందుకు వందల మంది అభిమానులు రాగా.. దారిపొడవునా వారికి అభివాదం చేశారు. దీనిపై కాంగ్రెస్‌ (Congress)పార్టీ తాజాగా స్పందిస్తూ.. ప్రధాని, ఈసీపై విమర్శలు గుప్పిచింది.

‘‘అహ్మదాబాద్‌లో ఓటెయ్యడానికి వెళ్లిన ప్రధాని.. రెండున్నర గంటల పాటు రోడ్‌ షో చేపట్టారు. దీన్ని అన్ని ఛానళ్లు ఉచితంగా కవర్‌ చేశారు. ఇది ప్రచారం కాదా? రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ, పాలనాయంత్రాంగం, ఎన్నికల సంఘం అన్నీ ఒక్కటైపోయినట్లు కన్పిస్తున్నాయి. మోదీ రోడ్‌షోపై ఈసీ మౌనంగా ఉంది. ఎలాంటి చర్యలు చేపట్టలేదు. చూస్తుంటే.. ఈసీ ఇష్టపూర్వకంగానే ఒత్తిడికి తలొగ్గినట్లు కన్పిస్తోంది’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా దుయ్యబట్టారు. మోదీ ‘నడక’పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అటు తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా మోదీ తీరును తప్పుబట్టింది. ‘‘ఎన్నికల సంఘం నిబంధనలను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలి. ఎన్నికల రోజున రోడ్‌షోలపై నిషేధం ఉంటుంది. కానీ వారు(భాజపా, మోదీని ఉద్దేశిస్తూ) ప్రత్యేక వ్యక్తులు కదా..! వీవీఐపీలు ఏదైనా చేయగలరు’’ అంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) విమర్శించారు.

ఖండించిన భాజపా..

అయితే.. ఈ ఆరోపణలను భాజపా నేతలు తిప్పికొట్టారు. ‘‘మోదీ కాన్వాయ్‌ను పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరం నిలపాల్సి వచ్చింది. అందుకే ప్రధాని నడుచుకుంటూ లోపలికి వెళ్లారు. పోలింగ్ కేంద్రం లోపలికి వాహనాన్ని తీసుకెళ్లలేం కదా? కాంగ్రెస్‌ కావాలనే రెచ్చగొడుతోంది’’ అని భాజపా నేతలు ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

3 గంటలకు 50శాతం పోలింగ్‌..

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.5శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 14 రాష్ట్రాల్లోని 93 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. అనంతరం ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలను రానున్నాయి. గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసెంబరు 8న ప్రకటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని