Andhra News: సీఎం జగన్‌ చేసేది పరిపాలనా?లేక వడ్డీ వ్యాపారమా?: నాదెండ్ల మనోహర్‌

గిట్టుబాటు ధరలు రాక, పండిన పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న రైతుల నుంచి నీటి తీరువా వసూలు విషయంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానం

Updated : 28 Apr 2022 06:45 IST

అమరావతి: గిట్టుబాటు ధరలు రాక, పండిన పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న రైతుల నుంచి నీటి తీరువా వసూలు విషయంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానం అప్రజాస్వామికంగా ఉందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. 2018 నుంచి నీటి తీరువా లెక్కగట్టి 6 శాతం వడ్డీతో రైతుల నుంచి వసూలు చేయడం దారుణమన్నారు. కట్టకపోతే రైతు భరోసా ఇవ్వం.. భవిష్యత్తులో పంట నష్టం పరిహారానికి అనర్హులను చేస్తామని బెదిరించడాన్ని పరిపాలన అంటారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ పాలన చేస్తున్నారా? లేక వడ్డీ వ్యాపారం చేస్తున్నారా?అని నిలదీశారు. గత నెలలో ఆస్తి పన్ను పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వైకాపా ప్రభుత్వం.. ఇప్పుడు రైతుల మీద పడిందని నాదెండ్ల ఆక్షేపించారు. నీటి పన్ను పేరుతో వేధింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా టార్గెట్ పెట్టి మరీ నీటి పన్ను వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా అన్నసముద్రం అనే చిన్న గ్రామానికి రూ.29 లక్షల నీటి పన్ను వసూలును టార్గెట్ పెట్టారని.. మరి రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు వడ్డీతో సహా రాబట్టాలనుకొంటున్నారో ప్రభుత్వం చెప్పాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.

రైతుల నుంచి ధాన్యం సేకరించిన మూడు రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని చెప్పిన సీఎం జగన్‌, నెలలు గడిచినా రైతులకు చెల్లించడం లేదన్నారు. నీటి తీరువాకు వడ్డీ విధిస్తున్న ఈ పాలకులు రైతులకు ఇవ్వాల్సిన మొత్తానికి వడ్డీ లెక్కగట్టి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రావాల్సిన రూ.7 లక్షల పరిహారాన్ని కూడా 6 శాతం వడ్డీతో చెల్లించాలన్నారు. ప్రణాళిక, రైతుల పట్ల కనీస బాధ్యత లేకుండా నిర్ణయాలు తీసుకొంటున్నారని ధ్వజమెత్తారు.  పాలనా పరమైన వైఫల్యాల వల్లే రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటివరకూ 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వీరిని ఆదుకోవడానికి ముందుకురాని రాష్ట్ర ప్రభుత్వం.. వసూళ్లు మాత్రం వడ్డీతో సహా చేస్తోందని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం వడ్డీ వ్యాపారం మానేసి ప్రజలకు సరైన పరిపాలన అందించాలని నాదెండ్ల హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని