Janasena: బ్రిటిష్‌ కాలం నాటి చట్టం ద్వారా ఆంక్షలు విధిస్తారా?: నాదెండ్ల

బహిరంగసభలు, ర్యాలీలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ తప్పుబుట్టారు. ఈ ప్రభుత్వం కచ్చితంగా ఏదో ఒక రోజు జీవించే హక్కును కూడా హరిస్తుందని మండిపడ్డారు. 

Published : 03 Jan 2023 16:37 IST

అమరావతి: రాజకీయా పార్టీలను నియంత్రించాలనే ఉద్దేశంతో బహిరంగసభలు, ర్యాలీలను నిషేధిస్తూ అర్ధరాత్రి వేళ హడావుడిగా ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైకాపా ప్రభుత్వం తన నిరంకుశ ధోరణిని బయటపెట్టిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. కౌలు రైతు భరోసా సభల్లో, జనవాణి కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  

‘‘విశాఖలో స్వచ్ఛందంగా జనం తరలివచ్చి పవన్‌ కల్యాణ్‌కు స్వాగతం పలకడం, ఆ తర్వాత పవన్‌ను నిర్బంధించడం అందరూ చూశారు. ఆ నిరంకుశత్వానికి కొనసాగింపే హోమ్‌శాఖ ఇచ్చిన చీకటి జీవో. రాజ్యాంగం ఆర్టికల్‌ 19 ద్వారా ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛలో రాజకీయ పార్టీల కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆర్టికల్‌ 19ని ఏపీలో నిషేధించాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించుకుందా? కచ్చితంగా ఏదో ఒక రోజు జీవించే హక్కును కూడా హరిస్తారు. సీఎం హోదాలో జగన్‌ విజయవాడ బెంజిసర్కిల్‌లో అన్ని మార్గాలను మూసివేసి చెత్త వాహనాలకు, రేషన్ వాహనాలకు జెండాలు ఊపలేదా? అప్పుడు ప్రజలకు కలిగిన ఇబ్బందులు కనిపించలేదా?సీఎం పర్యటన అనగానే అన్ని మార్గాల్లో దుకాణాలు మూయించేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు పార్టీ కార్యక్రమాలకు మళ్లించేస్తున్నారు. ఇవేవీ జనజీవనాన్ని స్తంభింపచేయడం లేదా? శాంతిభద్రతల పేరుతో హక్కులు కాలరాయడం రాజ్యాంగ  ఉల్లంఘనే. ప్రత్యేక సందర్భాల్లో అనుమతి ఇస్తాం అని జీవోలో చెప్పడాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ప్రత్యేక సందర్భాలు అనేవి కేవలం వైకాపాకు మాత్రమే వస్తాయా? అనే ప్రశ్నకు జీవో ఇచ్చిన ఉన్నతాధికారి, జీవో ఇప్పించిన పాలకుడు సమాధానం ఇవ్వాలి’’ అని నాదేండ్ల మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని