logo

కారు యజమానులకూ కష్టాలు..

కారున్నవారికి సమస్యలుండవా.. అంటే చాలానే అన్న సమాధానమే వినిపిస్తోంది. ప్రధానంగా నగరంలో ట్రాఫిక్‌ సమస్యలతో ముప్పతిప్పలు పడుతున్నామని గగ్గోలు పెడుతున్న పరిస్థితి దాపురించింది. చెన్నైలో తాజాగా నిర్వహించిన సర్వేలో కార్ల యజమానులు ప్రత్యేక డిమాండ్లను ముందుంచారు.

Published : 01 May 2024 01:29 IST

తీర్చాలని కాబోయే ఎంపీలకు విన్నపం
చెన్నైలో నిర్వహించిన సర్వేలో వెల్లడి
ఈనాడు-చెన్నై

కారున్నవారికి సమస్యలుండవా.. అంటే చాలానే అన్న సమాధానమే వినిపిస్తోంది. ప్రధానంగా నగరంలో ట్రాఫిక్‌ సమస్యలతో ముప్పతిప్పలు పడుతున్నామని గగ్గోలు పెడుతున్న పరిస్థితి దాపురించింది. చెన్నైలో తాజాగా నిర్వహించిన సర్వేలో కార్ల యజమానులు ప్రత్యేక డిమాండ్లను ముందుంచారు. కాబోయే ఎంపీలు తమ సమస్యలు పట్టించుకోవాలని అందులో వెల్లడించారు.

ప్రముఖ కార్‌ యాప్‌ సంస్థ చెన్నైతో పాటు దిల్లీ ఎన్సీఆర్‌, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్‌ నగరాల నుంచి 50వేల మంది కారు యజమానులతో సర్వే నిర్వహించింది. నగరంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యే ప్రజాప్రతినిధుల నుంచి ఏం ఆశిస్తున్నారనే దానిపై ప్రత్యేకంగా మాట్లాడారు. కారు యజమానులు కూడా ప్రజలేనని, వారికీ చాలా ఇబ్బందులున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు యాప్‌ నిర్వాహకులు వివరిస్తున్నారు.

విపరీతమైన ట్రాఫిక్‌..

కార్యాలయ వేళల్లో ట్రాఫిక్‌ విపరీతంగా ఉంటోందని యజమానులు విసుగు చెందుతున్నారు. ఆ సమయాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ అదుపు తప్పడంలో ఇబ్బందులు పెరుగుతున్నాయనే విషయాన్ని సర్వేలో వెల్లడించారు. చెన్నైలో తమకున్న ప్రధాన సమస్యల్లో దానికి తొలి ప్రాధాన్యంగా వారు వివరించారు. రద్దీ ప్రాంతాల్లో సజావుగా సకాలంలో వెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

మాటలు భరించలేకున్నాం

ఒక వాహనదారుడు మరో వాహనదారుడిపై పరుషమైన పదజాలంతో దుర్భాషలాడే సంస్కృతి చెన్నైలో కనిపిస్తోందని కారు యజమానులు సర్వేలో అభిప్రాయపడ్డారు. పలు సందర్భాల్లో గొడవలు జరిగిన దాఖలాలూ ఉన్నాయన్నారు. ఈ పరిస్థితులు ఆ దారిన వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, విసుగు తెప్పిస్తున్నాయని చెబుతున్నారు. ఈ తరహా ధోరణిపై పోలీసులు కఠిన నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నారు. ఈ సమస్యకు రెండో ప్రాధాన్యం ఇచ్చారు.

ఎటు చూసినా అతిక్రమణ

చెన్నైలో మరో ప్రధాన సమస్య.. పార్కింగ్‌. చిన్న వీధుల దగ్గర నుంచి ప్రధాన రహదారుల దాకా ఎటుచూసినా రోడ్లకు ఇరువైపులా విపరీతంగా వాహనాలు నిలుపుతుంటారు. ఈ పరిస్థితులు కారు యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సర్వే నివేదికలో తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం పార్కింగ్‌కు అనుమతులు ఇవ్వపోయినా నిబంధనలు అతిక్రమించి వాహనాలు పెడుతున్నారని అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈ సమస్యకు మూడో ప్రాధాన్యం ఇస్తూ ఈ పరిస్థితి నుంచి నగరాన్ని బయటపడేయాలని కోరుతున్నారు.


రోడ్లు బాగుండాలి

కారు యజమానుల్లో ఎక్కువమంది మధ్యతరగతి కుటుంబీకులే సర్వేలో పాల్గొన్నట్లు నిర్వాహకులు వివరించారు. చాలా రకాల సమస్యలు సర్వే ముందుకొచ్చాయని, వాటిలో కొన్ని ముఖ్యమైనవీ ఉన్నాయన్నారు. మంచి రోడ్లు, ట్రాఫిక్‌ సమస్యలపై సులువైన పరిష్కారం వారికి ప్రధాన ఎజెండాగా ఉందని చెప్పారు. ఆయా రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలపైనా దృష్టి సారించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు సర్వే నివేదికలో వెల్లడైంది.


మహిళా సిబ్బంది పెరగాలి

సర్వేలో మొత్తం 81శాతం మంది ట్రాఫిక్‌ పోలీసులు తమతో స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ఎదుటి వాహనాలు ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేస్తూ చుట్టుపక్కల వారినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని 61శాతం మంది అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్‌ పోలీసుల్లో ఇప్పుడున్న మహిళా సిబ్బందిని మరింతగా పెంచాలని 83 శాతం మంది కోరుతున్నారు. వారిని హైవేలు, ప్రధాన రహదారుల్లో విధుల్లో ఉంచాలని వెల్లడించారు. ప్రత్యేకించి వర్షాలొచ్చినప్పుడు నగరంలో నీరు నిలిచే సమస్యలు బాగా ఉన్నాయని 72శాతం మంది అన్నారు.


మౌలిక వసతులు..

కారులో ప్రయాణించాలన్నా, నడపాలన్నా ఒత్తిడితో కూడుకున్న సమస్యగా నగరాలు మారుతున్నాయని రోడ్డు భద్రతా నిపుణుడు, ఐఆర్‌ఎఫ్‌ రోడ్‌సేఫ్టీ అంబాసిడర్‌ అఖిలేష్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఇలాంటివారి బాధల్ని సైతం ప్రజాప్రతినిధులు, పోలీసులు అర్థం చేసుకోవాల్సిన అవసరముందని ఆయన గుర్తుచేశారు. నగరాల్లో కార్లు పెరుగుతున్నా.. వాటికి తగ్గ మౌలిక వసతులు, సరైన రోడ్లు పూర్తిస్థాయిలో లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం డ్రైవర్లుగా మహిళలు కూడా పెద్దఎత్తున ముందుకొస్తున్నారని, ఈ విషయాన్ని కాబోయే ఎంపీలు, పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి వారికి తగ్గట్లు నగర వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. వారి సమస్యలపైనా దృష్టిపెట్టాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని