Nara Lokesh: తెదేపా అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ: నారా లోకేశ్‌

రానున్న ఎన్నికల్లో విజయం తెదేపాదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

Updated : 11 Feb 2024 14:25 IST

ఇచ్ఛాపురం: రానున్న ఎన్నికల్లో విజయం తెదేపాదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

‘‘ఉత్తరాంధ్ర అమ్మలాంటిది. అమ్మప్రేమకి ఎలా కండిషన్స్‌ ఉండవో.. ఇక్కడి ప్రజలూ అంతే. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా. గరిమెళ్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టి గడ్డ ఇది. ఇలాంటి ప్రాంతంలో ‘శంఖారావం’ యాత్ర ప్రారంభిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా. తెదేపా పాలనలో ఉత్తరాంధ్రను జాబ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా చేస్తే.. జగన్‌ గంజాయి క్యాపిటల్‌గా మార్చారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని ఆయన.. ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు. మోసం, దగా, కుట్రకి ప్యాంటు షర్ట్‌ వేస్తే జగన్‌లా ఉంటుంది.

2019 ఎన్నికల ముందు 23 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామని వైకాపా హామీ ఇచ్చింది. ఆ తర్వాత 18 వేల పోస్టులే ఉన్నాయన్నారు. స్కూల్‌ రేషనలైజేషన్‌ పేరుతో పోస్టులు తగ్గించారు. ఇప్పుడు ఎన్నికల ముందు నామమాత్రంగా 6 వేల పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు డీఎస్సీ ద్వారా లక్షా 70వేల పోస్టులు భర్తీ చేశారు. వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం.

వారిపై న్యాయవిచారణ.. వడ్డీతో సహా చెల్లిస్తాం

జగన్‌ సభలు చూస్తుంటే నవ్వొస్తోంది.. దేనికి సిద్ధం? జైలుకెళ్లేందుకా? ఆయన తన కుటుంబసభ్యులకే రక్షణ కల్పించడం లేదు. తమకు భద్రత లేదని షర్మిల, సునీత అంటున్నారు. సొంత చెల్లెళ్లకే భద్రత ఇవ్వకపోతే సాధారణ మహిళల పరిస్థితేంటి? దేశంలో వంద సంక్షేమ పథకాలకు కోతపెట్టిన ఏకైక సీఎం జగన్‌. జగన్‌ ఇచ్ఛాపురానికి ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చలేదు. తెదేపా వచ్చాక పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. కొబ్బరి, జీడి రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. వైకాపా భూకబ్జాలకు సహకరించలేదని విశాఖపట్నంలో తహసీల్దార్‌ రమణయ్యను కొట్టి చంపారు. చంద్రబాబుతో పాటు నాపై ఎన్నో దొంగకేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదు. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్‌ బుక్‌లో ఉన్నాయి. వారిపై న్యాయవిచారణ జరిపిస్తాం. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం’’ అని లోకేశ్‌ అన్నారు.

అవాంతరాలు సృష్టించినా ‘యువగళం’ ఆపలేదు: ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు సృష్టించినా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రను ఆపకుండా కొనసాగించారని చెప్పారు. కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలనేది ఆయనకు తెలుసన్నారు. దిల్లీలో మన గళం వినిపించాలంటే లోక్‌సభ స్థానాల్లోనూ తెదేపాను గెలిపించాలని కోరారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంపై తమకు నమ్మకముందని.. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. 

ఇచ్ఛాపురం ఎప్పటికీ తెదేపా కంచుకోటే..: ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

జగన్‌ పాలనతో రాష్ట్రం అన్నివిధాలుగా నష్టపోయిందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. రాజకీయాలను భ్రష్టుపట్టించారని విమర్శించారు. ప్రతి కార్యకర్తా చంద్రబాబు, లోకేశ్‌లా ఆలోచించాలన్నారు. ‘‘నేడు మనందరం పోరాటం చేస్తోంది రాక్షసుడితో. అతడితో పోరాటం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. జగన్‌ను ఏ విధంగా గద్దె దించాలనేది ప్రజలంతా ఆలోచించాలి. రాష్ట్రం కోసం పవన్‌కల్యాణ్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు. వైకాపా పాలనలో జరుగుతున్న అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునేందుకు చంద్రబాబుతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇచ్ఛాపురం ఎప్పటికీ తెదేపా కంచుకోటగా ఉంటుంది’’ అని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని