Caste Census: జనాభాలో 73 శాతం.. టాప్‌-200 కంపెనీల్లో ఒక్కటీ వారి చేతుల్లో లేదు: రాహుల్‌ గాంధీ

కులగణనను దేశ ఎక్స్‌-రేగా పునరుద్ఘాటించిన కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ.. దీనిద్వారా అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

Published : 18 Feb 2024 22:44 IST

ప్రయాగ్‌రాజ్‌: దేశ జనాభాలో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 73 శాతంగా ఉన్నారని.. అయితే, భారత్‌లోని టాప్‌-200 సంస్థల్లో ఒక్కటీ వారి యాజమాన్యంలో లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. కులగణన (Caste Census)ను దేశ ఎక్స్‌-రేగా పునరుద్ఘాటిస్తూ.. దీని ద్వారా అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని చెప్పారు. ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని అలహాబాద్ యూనివర్సిటీ సమీపంలో ప్రసంగించారు.

దేశంలోనే అత్యంత పాపులర్‌ సీఎం ఎవరంటే..?

‘‘కులగణన మీ ఆయుధం. మీ జనాభా ఎంత ఉందో తెలుసుకోవాలి. దేశ సంపదలో మీ వాటా ఎంత అనేది కనుక్కోవాలి’’ అని యువతను ఉద్దేశించి రాహుల్‌ వ్యాఖ్యానించారు. దేశంలోని టాప్‌ 90 ఐఏఎస్‌ అధికారుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఈ వర్గాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. దేశంలోని 10-15 మంది బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన రూ.14 లక్షల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసిందని ఆరోపించారు. ఏనాడూ రైతుల రుణాల గురించి పట్టించుకోలేదన్నారు.

అమేఠీకి స్మృతి ఇరానీ, రాహుల్‌..

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాహుల్‌ గాంధీలు సోమవారం అమేఠీలో వేర్వేరుగా పర్యటించనున్నారు. ‘న్యాయ్‌ యాత్ర’లో భాగంగా పట్టణంలో రాహుల్ రోడ్‌ షో నిర్వహించనున్నారు. గతంలో ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 15 ఏళ్లపాటు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఒకే సమయంలో ఈ ఇద్దరు నేతలు అమేఠీలో పర్యటించడం ఐదేళ్లలో ఇది రెండోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని