‘ఏం చెప్పొద్దండీ.. మీరు మాకేం చేయలేదు’: వైకాపా ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

కర్నూలు జిల్లా కొడుమూరు మండలంలో ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యే  డాక్టర్ జరదొడ్డి సుధాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది.

Published : 14 May 2022 02:20 IST

కొడుమూరు: కర్నూలు జిల్లా కొడుమూరు మండలంలో ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యే  డాక్టర్ జరదొడ్డి సుధాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మండలంలోని అనుగొండ గ్రామంలో శుక్రవారం మండల స్థాయి అధికారులు నిర్వహించిన ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన, వైఎస్‌ఆర్ గ్రామీణ పథకం కింద ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అనుగొండ, ఎర్రదొడ్డి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలోని గ్రామస్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కొడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్‌ను గ్రామానికి చెందిన కొంత మంది మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. పర్యటనలో భాగంగా ముందుగా అనుగొండ గ్రామ శివారులోని స్థానిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతున్న సమయంలో కార్యక్రమానికి వచ్చిన మహిళలు ఒక్కసారిగా లేచి.. ‘‘మాకు ఏమీ చెప్పొద్దండి.. మీరు మాకేమీ చేయలేదు.. మేమేదైనా అడిగితే మీరు పెడచెవిన పెడతారు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మరుగుదొడ్లు, ఇళ్ల స్థలాలు, అమ్మ ఒడి, పింఛన్, ఎస్సీలకు సాగుభూమి పంపిణీ తదితర సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీస్తూ మహిళలు మూకుమ్మడిగా ఆయన్ను వివిధ ప్రశ్నలతో ముంచెత్తారు. మాట్లాడుతుండగానే మహిళలు ఒక్కసారిగా నిలదీయడంతో ఎమ్మెల్యే చేసేదేమీ లేక వేదిక వద్ద నుంచి మహిళల దగ్గరకు చేరుకొన్నారు. అక్కడే మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సంబంధిత అధికారులు, వాలంటర్లపై ఎమ్మెల్యే మండిపడ్డారు. అనంతరం 27 మంది లబ్ధిదారులకు పీఎంఏవై కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి ఆవాజ్ యోజన, వైఎస్‌ఆర్ గ్రామీణ పథకం కింద మండలంలోని అర్హులైన 719 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశాం. త్వరలోనే గడప గడపకు అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమం ఉంది. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చేరుకొని సమస్యలను వివరంగా తెలుసుకొంటాం. ఆపై 90 రోజుల్లోనే పరిష్కారానికి కృషి చేస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామం. నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికీ అందుతాయి’’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని