UP: మోదీ నమ్మకస్తుడికి కీలక పదవి

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్‌పై భారతీయ జనతా పార్టీ గట్టిగా దృష్టి పెట్టింది. ఆ రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ విషయంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుపై

Updated : 04 Jun 2021 13:55 IST

ఎన్నికల నేపథ్యంలో యూపీ కేబినెట్‌లో మార్పులు 

లఖ్‌నవూ: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్‌పై భారతీయ జనతా పార్టీ గట్టిగా దృష్టి పెట్టింది. ఆ రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ విషయంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుపై గత కొంతకాలంగా విమర్శలు వస్తుండటంతో కేబినెట్‌లో మార్పులు చేర్పులకు సిద్ధమైంది. ఎన్నికల దృష్ట్యా మంత్రి వర్గంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని భావిస్తోన్న కాషాయ పార్టీ.. ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తుడైన ఏకే శర్మకు యూపీ ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వనున్నట్లు భాజపా వర్గాలు సమాచారం. అయితే నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది.

యూపీలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాజపా ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు రావడంతో యోగిని పదవి నుంచి దించే అవకాశాలున్నాయంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఆ వార్తలకు చెక్‌ పెడుతూ ఆదిత్యనాథే సీఎంగా కొనసాగుతారని, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌, యోగి నాయకత్వంలోనే పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుందని భాజపా వర్గాలు చెప్పాయి. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నెలలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కొత్త వారికి మంత్రిత్వ బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలతో చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఎవరీ ఏకేశర్మ..

ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తులైన అధికారుల్లో ఒకరైన మాజీ ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ శర్మ.. ఈ ఏడాది జనవరిలోనే భాజపాలో చేరారు. తొలుత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు ఆయన పేరు ప్రకటించని కాషాయ పార్టీ.. తాజాగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన అరవింద్‌ కుమార్ శర్మ‌.. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన అరవింద్‌ కుమార్‌ శర్మకు ప్రధాని నరేంద్ర మోదీతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. 2001లో మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. అలాగే,  గుజరాత్‌ మౌలిక సదుపాయాల బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గానూ ఉన్నారు. అనంతరం  2014లో భాజపా అఖండ విజయంతో ,  ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లోకి వచ్చారు. కరోనా లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్న సమయంలో గతేడాది మే నెలలో శర్మ ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖకు బదిలీపై వెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు