బిహార్‌ పోల్స్‌:12 ర్యాలీల్లో మోదీ ప్రచారం

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచార పర్వం కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నెల 28న తొలి విడత ఎన్నికలు జరగనున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు .......

Updated : 29 Feb 2024 18:43 IST

దిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచార పర్వం కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నెల 28న తొలి విడత ఎన్నికలు జరగనున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు ప్రచార జోరును మరింతగా పెంచాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన 12 ర్యాలీల్లో పాల్గొంటారని భాజపా నేత, బిహార్‌ ఎన్నికల ప్రచార బాధ్యతలు చూస్తున్న దేవేంద్ర ఫడణవీస్‌ వెల్లడించారు. తొలి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 23న ససరాంలో తొలి ర్యాలీలో పాల్గొంటారని ఆయన తెలిపారు. అదే రోజు గయా, భాగల్పూర్‌లలోనూ ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే, ఈ నెల 28న (తొలి విడత పోలింగ్‌ రోజు) దర్భంగా, ముజఫర్‌పూర్‌, పట్నాలలో ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఫడణవీస్‌ వెల్లడించారు.

రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్‌ 1న చంపారన్‌, సమస్థిపూర్‌లో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అలాగే, చివరి విడత ఎన్నికల ప్రచారం నవంబర్‌ 3న పశ్చిమ చంపారన్‌లో ప్రారంభమై సహస్ర, అరారియాలతో ముగుస్తుందని ఫడణవీస్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో భాజపా - జేడీయూ మరికొన్ని పార్టీలు కలిసి ఎన్డీయే కూటమిగా బరిలోకి దిగిన నేపథ్యంలో జేడీయూ అధినేత, సీఎం నితీశ్‌కుమార్‌కు ఓటు వేయాలని తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను కోరనున్నారు. బిహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 10న ఓట్ల లెక్కింపు చేపట్టనునున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు