Chandrababu: బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్‌.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు.

Updated : 29 Mar 2024 17:56 IST

కావలి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘బాబాయిని చంపిన వారికి ఎంపీ సీటు ఇచ్చారు. న్యాయం చేయాలని కోరిన చెల్లెలుపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.. చట్టాలపై గౌరవం లేదు.

ఎన్టీఆర్‌.. తెదేపా ప్రారంభించిన గొప్ప రోజు ఇది. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించిన రోజు. జగన్‌ లాంటి వ్యక్తి సీఎం అవుతారని నేనెప్పుడూ ఊహించలేదు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టారు. వైకాపా నేతలు ప్రజల ఆస్తులు కబ్జా చేస్తున్నారు. ఎదురు తిరిగిన వారిపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. దళారి వ్యవస్థకు బీజాలు వేసిన వ్యక్తి జగన్‌. వైకాపా నేతలు వస్తుంటే జనం పారిపోతున్నారు. మిట్టమధ్యాహ్నం కూడా మా సభలకు ప్రజలు తరలివస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు ఏమైందో ప్రజలు చూశారు. అధికార అహంకారంతో అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. ఎవరు పేద వారో.. ఎవరు పెత్తందారో ప్రజలు తెలుసుకోవాలి. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్‌. ఎక్కువ మంది పేదలు ఉన్న రాష్ట్రం ఏపీ. విలాసవంతమైన భవనాలు కట్టుకోవడంలో ఆయనే నంబర్‌ వన్‌. అనేక ప్యాలెస్‌లు కట్టుకున్న జగన్‌.. పేద వాడా? పెత్తందారా? ఐదేళ్లుగా టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా వేధించారు. ఇప్పుడున్న ఇంటి కాలనీలన్నీ ఉంటాయి.. ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. పిల్లలు, యువత భవిష్యత్తుకు గ్యారంటీ నాది.నేనేం చేశానని జగన్‌ అడుగుతున్నారు..చరిత్ర చూడాలి. నేను సీఎంగా ఉన్నప్పుడు 9 సార్లు డీఎస్సీ వేశాం. పేద పిల్లలు ఉన్నత విద్య చదువుకునేలా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ఇచ్చి ప్రోత్సహించాం’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని