Priyanka Gandhi: ప్రియాంక గాంధీ పీఎంపై పోటీ చేస్తే..విపక్ష కూటమి నేత ఏమన్నారంటే..?

కాంగ్రెస్(Congress) నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై విపక్ష కూటమి నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

Published : 19 Aug 2023 17:21 IST

దిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారో..? లేదో..? ఇంతవరకు స్పష్టత లేదు. అయితే ఆమె వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే.. విపక్షాల కూటమి మద్దతు ఉంటుందని శివసేన(యూబీటీ) నేత ప్రియాంకా చతుర్వేది(Priyanka Chaturvedi)అన్నారు. అలాగే ఆమె విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘ఆమె ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే, విపక్షాల నుంచి అందుకు అంగీకారం లభిస్తే.. ఆమె విజయం కోసం కూటమి పనిచేస్తుంది’ అని మీడియాకు వెల్లడించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ(PM MODI) వారణాసి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 

భాజపా(BJP) విధానాలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ఆ కూటమిని ప్రధాని విమర్శించడంపై చతుర్వేది స్పందించారు. తమ కూటమి మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షాలో వణుకుపుట్టించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  అలాగే లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎలా ఎంచుకుంటారని అడగ్గా.. ఏ స్థానానికి ఎవరు సరైన వ్యక్తో విపక్ష నేతలందరితో చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుందని చెప్పారు. 

చదువుకున్న నేతకు ఓటేయమనడం తప్పా..? ‘అన్‌అకాడమీ’పై తీవ్ర విమర్శలు

రాహుల్‌ వయనాడ్ నుంచి పోటీ చేస్తారు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి అమేఠీ(Amethi) నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ యూపీ చీఫ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై మరో సీనియర్ నేత హరీశ్ రావత్ స్పందించారు. ‘అమేఠీ(యూపీ)(Amethi).. రాహుల్ గాంధీ ఎప్పటినుంచో పోటీ చేస్తున్న స్థానం. అయితే రాహుల్ వయనాడ్(కేరళ) నుంచి కూడా పోటీ చేస్తారు. ఎందుకంటే, సంక్షోభ సమయంలో వయనాడ్(Wayanad) ప్రజలు ఆయనకు అండగా నిలిచారు’ అని అన్నారు. రాహుల్ గాంధీ 2004 నుంచి అమేఠీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన భాజపా నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చవి చూశారు.  అదే సమయంలో వయనాడ్‌ స్థానం నుంచి మాత్రం విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని