logo

నా ఒక్క ఓటే కదా... అనుకుంటే ఎలా?

‘నా ఒక్క ఓటే కదా.. వేయకపోతే ఏమవుతుంది’ చాలా మందిలో ఉన్న భావన ఇదే. ఓటు హక్కు ఉన్నప్పటికీ పోలింగ్‌ కేంద్రం వరకు వచ్చి ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి చూపించరు. ఇలా ప్రతి ఒక్కరు నా ఒక్క ఓటే కదానుకుంటే అనర్హులు అందలమెక్కే ప్రమాదం ఉందని భావించాలి.

Updated : 01 May 2024 08:22 IST

గెలుపోటముల్లో ప్రతి ఓటు కీలకమే

ఈనాడు, హైదరాబాద్‌: ‘నా ఒక్క ఓటే కదా.. వేయకపోతే ఏమవుతుంది’ చాలా మందిలో ఉన్న భావన ఇదే. ఓటు హక్కు ఉన్నప్పటికీ పోలింగ్‌ కేంద్రం వరకు వచ్చి ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి చూపించరు. ఇలా ప్రతి ఒక్కరు నా ఒక్క ఓటే కదానుకుంటే అనర్హులు అందలమెక్కే ప్రమాదం ఉందని భావించాలి. భాగ్యనగరంలో ప్రతి ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తగ్గడానికి రకరకాల కారణాలతోపాటు కొందరి ఓటర్లలో ఉన్న ఇలాంటి ధోరణి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు కీలకమే. కొన్నిసార్లు ఒక్క ఓటు సైతం అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. గత ఎంపీ ఎన్నికలో పాతబస్తీలో మరీ తక్కువగా 39 శాతం ఓట్లు పోలవగా దాదాపు 61 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకోలేదు. ఒక్క చేవెళ్లలో 53.80శాతం ఓట్లు పోలవగా సికింద్రాబాద్‌, మల్కాజిగిరిల్లో 45 శాతం లోపే నమోదయ్యాయి.

ప్రశ్నించే హక్కు ఎక్కడ?

ఓటు వేయకుంటే ప్రశ్నించే తత్వం బలహీన పడుతుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల ధైర్యంగా స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి ఆయా సమస్యలను నేరుగా తీసుకెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా అన్ని ప్రధాన పార్టీలు నియోజకవర్గాల వారీగా మానిఫెస్టోలను తయారు చేసి కాలనీలు, అపార్ట్‌మెంట్లలో పంచుతున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల గెలిచిన అభ్యర్థి ఆయా సమస్యలపై దృష్టి పెట్టకపోతే నిలదీసే అవకాశం ఉంటుంది. అసలు ఓటే వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు.


నోటా ఉంది కదా...?

ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాను ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. నగరంలో ప్రతి ఎన్నికల్లో కొన్ని నియోజక వర్గాల్లో పెద్ద సంఖ్యలో నోటా ఓట్లు నమోదయ్యాయి. నోటా ద్వారా తమ పనితీరు నచ్చక ప్రజలు ఎక్కువ శాతం నోటాను ఎన్నుకుంటున్నారని అభ్యర్థుల్లో బాధ్యతను గుర్తు చేయవచ్చని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని