logo

దివ్యాంగుడిని చితకబాది.. వృద్ధురాలిపై దాడి

తన సెల్‌ఫోన్‌ను ఓ వ్యక్తి తీసుకొని తిరిగివ్వడంలేదని ఫిర్యాదు చేయడమే ఆ దివ్యాంగుడు చేసిన పాపం. రెండు కాళ్లు పనిచేయని అతడిని కానిస్టేబుల్‌ దారుణంగా చితకబాదాడు. తన కుమారుడిని ఎందుకు కొట్టారని ప్రశ్నించిన అతని తల్లినీ వదల్లేదు.

Updated : 01 May 2024 08:26 IST

ఆర్జీఐఏ ఠాణాలో కానిస్టేబుల్‌ అమానవీయ ప్రవర్తన
ఫోన్‌ పోయిందని ఫిర్యాదు చేసినందుకు ఎదురుదాడి

తల్లితో బాధితుడు ఆంజనేయులు

ఈనాడు- హైదరాబాద్‌, శంషాబాద్‌, న్యూస్‌టుడే: తన సెల్‌ఫోన్‌ను ఓ వ్యక్తి తీసుకొని తిరిగివ్వడంలేదని ఫిర్యాదు చేయడమే ఆ దివ్యాంగుడు చేసిన పాపం. రెండు కాళ్లు పనిచేయని అతడిని కానిస్టేబుల్‌ దారుణంగా చితకబాదాడు. తన కుమారుడిని ఎందుకు కొట్టారని ప్రశ్నించిన అతని తల్లినీ వదల్లేదు. సైబరాబాద్‌లోని ఆర్జీఐఏ పోలీసుస్టేషన్‌లో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు ప్రయత్నించగా.. రాజీ కుదుర్చుకోమంటూ తోటి కానిస్టేబుళ్లు ఒత్తిడి చేయడం గమనార్హం.

డయల్‌ 100కు ఫిర్యాదు చేస్తావా..?

శంషాబాద్‌కు చెందిన ఎం.ఆంజనేయులు దివ్యాంగుడు. తల్లి(70)తో కలిసి ఉంటున్నాడు.  ఏప్రిల్‌ 23న స్థానిక యువకుడు ఆంజనేయులు ఫోన్‌ తీసుకుని  అమ్మేశానని చెప్పాడు. ఈ విషయంపై ఆంజనేయులు డయల్‌ 100కు ఫిర్యాదు చేశాడు. 29న పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. ఫోన్‌ తీసుకున్న వ్యక్తిని తీసుకురావాలని సిబ్బంది చెప్పారు. ఆంజనేయులు సదరు వ్యక్తిని ఠాణాకు తీసుకొచ్చాడు. విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రెడ్డి అతణ్ని కొద్దిసేపు లోపలే ఉంచాడు. ఆంజనేయులుతో మాట్లాడి రాజీ కుదుర్చుకోవాలని సూచించాడు. కొద్దిసేపటి తర్వాత సదరు వ్యక్తి బయటకు వచ్చాడు.  ఏమైందని ఆంజనేయులు  కానిస్టేబుల్‌ను అడిగాడు.కోపోద్రిక్తుడైన కానిస్టేబుల్‌.. ఆంజనేయులు, మరో వ్యక్తిని చితకబాదాడు. డయల్‌ 100కు ఎందుకు ఫోన్‌ చేశావంటూ పొత్తి కడుపులో, ముఖంపై ఎడాపెడా కొట్టాడు. ఆంజనేయులు తల్లి  ఠాణాకు వచ్చి ఎందుకు కొట్టారని కానిస్టేబుల్‌ను ప్రశ్నించగా.. ఆమెనూ  బలంగా కొట్టడంతో కిందపడిపోయింది. ఈ అమానుషాన్ని తోటి సిబ్బంది చూస్తూ ఉండిపోయారు.

అకారణంగా కొట్టి..!

‘‘ఫోన్‌ తీసుకున్నాడని ఫిర్యాదు చేసినందుకు కానిస్టేబుల్‌ అకారణంగా కొట్టాడు. ఇదేమిటని ప్రశ్నించిన నా తల్లిపైనా దాడి చేశాడు. నా అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా.. ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి రాజీ కుదుర్చుకోవాలని సూచిస్తున్నారు.’’అని ఆంజనేయులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని