logo

బాబోయ్‌ అన్నా... బే‘ఖాతా’ర్‌..!

మే.. సామాజిక పింఛన్లను బ్యాంకుల్లో వేయడమంటే.. వృద్ధులు, దివ్యాంగులను ఎండల్లో ముప్పుతిప్పలు పెట్టడమే. కావాలనే... ఎన్నికలకు ముందు వారిని వేధించి.. ప్రాణాలమీదకొచ్చేలా చేయడమే.

Published : 01 May 2024 06:05 IST

పింఛను సొమ్ము ఖాతాల్లో వేయడం దారుణం

ఏళ్లుగా వినియోగంలో లేనివే అధికం

వాటిని పునరుద్ధరించడానికే చాలా సమయం

ఐఎండీ హెచ్చరికలనూ లెక్క చేయని వైనం

 

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - మచిలీపట్నం, కార్పొరేషన్‌: మే.. సామాజిక పింఛన్లను బ్యాంకుల్లో వేయడమంటే.. వృద్ధులు, దివ్యాంగులను ఎండల్లో ముప్పుతిప్పలు పెట్టడమే. కావాలనే... ఎన్నికలకు ముందు వారిని వేధించి.. ప్రాణాలమీదకొచ్చేలా చేయడమే. అయిదేళ్లుగా ఉమ్మడి జిల్లాలో లక్షల మంది పింఛనుదారులు తమ బ్యాంకు ఖాతాలను వినియోగించిందే లేదు. బ్యాంకు ఖాతాను ఏడాది వాడకపోతేనే అది స్తంభించిపోతుంది. మళ్లీ వినియోగంలోకి తేవాలంటే.. ఆధార్‌కార్డు, ఫొటో తీసుకుని బ్యాంకుకు వెళ్లాలి. దీనికి ఒక రోజైనా పడుతుంది. కానీ.. ఇవేమీ వృద్ధులకు తెలియవు. మీ ఖాతాల్లో డబ్బులు వేశాం. ఇక మీ బాధలేవో మీరే పడండనేలా ఉంది అధికారుల వైఖరి. కేవలం వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు, వాలంటీర్లు లేకనే ఈ దారుణమనే భావన కలిగించేలా కుట్ర పన్నారు.

ఉమ్మడి జిల్లాలో 4.81 లక్షలమంది పింఛనుదారులు ఉన్నారు. బ్యాంకులు అందుబాటులో లేని గ్రామాల్లోనే లక్షలమంది ఉన్నారు. బ్యాంకులు, ఏటీఎంలు ఎక్కడున్నాయో కూడా చాలామందికి తెలియదు. అసలు తమకు బ్యాంకు ఖాతా ఉందనే విషయాన్నే చాలామంది మరచిపోయారు. ఏళ్లుగా వాడని ఖాతాల్లో పింఛను డబ్బులు వేస్తామని అధికారులు చెప్పడంతో గ్రామీణ వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. పింఛను లబ్ధిదారులు.. అయిదేళ్లలో ఒక్కసారి కూడా బ్యాంకు ఖాతాలను వాడలేదు. ప్రభుత్వం  ఒక్కసారి కూడా పింఛన్లను ఖాతాల్లో వేసింది లేదు. ఇలాంటి ఖాతాల్లో డబ్బులు వేస్తామనడం అంటే.. దారుణమే.

నగదు తీయడం కష్టమే..

బ్యాంకు ఖాతా ఏడాదిపాటు వాడకపోతే స్తంభించిపోతుంది. ఇలాంటి ఖాతాల్లోకి సొమ్ము వేయడానికి ఇబ్బంది లేకున్నా.. డ్రా చేయడమే కష్టం. ఖాతాను మళ్లీ వాడుకలోకి తేవాలంటే.. పింఛనుదారులు బ్యాంకులకు వెళ్లాలి. సిబ్బంది ఒక్కొక్కరికి అరగంటైనా కేటాయిస్తే తప్ప పునరుద్ధరణ సాధ్యం కాదు. ఇవన్నీ చేశాక.. మైనస్‌ నిల్వఖాతాల నుంచి ఛార్జీల రూపంలో కోత పడుతుంది. రూ.3 వేల పింఛనులో చివరకు చేతికి ఎంత వస్తుందనేది తెలియని పరిస్థితి.

మండుతున్న ఎండలో వెళ్లాలా?

పగటి ఉష్ణోగ్రతలు.. 40 డిగ్రీలపై మాటే. వడగాలుల తీవ్రత ఎక్కువని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరిస్తోంది. వృద్ధులు, పిల్లలు ఎవరూ సాధ్యమైనంతవరకు బయటకు రావొద్దని సూచిస్తోంది. నీరసంతో శరీరం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని చెబుతోంది. ఐఎండీ హెచ్చరికలు ప్రభుత్వానికీ నిత్యం వెళ్తుంటాయి. అయినా.. లబ్ధిదారులను హింస పెట్టాలన్న ఏకైక లక్ష్యంతోనే అధికారులు పింఛన్ల పంపిణీని రాజకీయాంశంగా మార్చేశారు.

రూ. 110 కోట్లకు పైగానే ఖాతాల్లోకి..

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని 4.81 లక్షల పింఛనుదారుల్లో 80 శాతం మందికి అంటే 3.84 లక్షలమంది బ్యాంకు ఖాతాల్లోనే పింఛను సొమ్ములు వేయనున్నారు.రి ఈ రెండు జిల్లాల్లోనూ పంచాల్సిన పింఛను డబ్బులు రూ. 142.98 కోట్లు. ఇందులో దాదాపు రూ. 110 కోట్ల వరకూ బ్యాంకుల ఖాతాల్లో పడనున్నాయి.రి ఈ డబ్బులు తీసుకోవడానికి పింఛనుదారులు నాలుగైదు రోజులపాటు బ్యాంకుల వద్ద రద్దీతో యాతన పడాల్సిన పరిస్థితి.

ఎందుకు ఇంత కక్ష

విజయవాడ నగరంలోనే అత్యధికంగా 69,325 మంది పింఛనుదారులున్నారు. వీరిలో 53,114 మందికి బ్యాంకు ఖాతాల్లోనే వేస్తున్నారు. కేవలం 16,211 మందికే ఇంటి వద్ద ఇవ్వాలని నిర్ణయించారు. నగరంలో 286 సచివాలయాల్లో 2,574 మంది సిబ్బంది ఉన్నారు. వీళ్లు ఒక్కొక్కరూ ఏడుగురి ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇస్తే కేవలం అరగంటలోనే 16 వేలమందికి పంచేస్తారు. మరో రెండు గంటలు కేటాయిస్తే.. మిగతా 53 వేలమందికీ పంచేయగలరు. కానీ.. కావాలనే కక్ష కట్టి వారి ఫ్రీజయిన ఖాతాల్లో డబ్బులు వేసి వేధించేందుకే ఈ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

అయ్యో..బ్యాంకు సిబ్బంది..

పింఛన్ల పంపిణీతో వచ్చే వారం రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని బ్యాంకర్లు హడలిపోతున్నారు. ఎందుకంటే చాలాకాలంగా స్తంభించిపోయి ఉన్న లబ్ధిదారుల ఖాతాలను పునరుద్ధరించడానికే కనీసం రెండుమూడు రోజులు పడుతుంది. ఈ బ్యాంకులకు గ్రామాల నుంచి రావాలంటే రూ.200-400 వరకు ఆటోలకే ఖర్చవుతుంది. పైగా వృద్ధులు, దివ్యాంగులకు తోడుగా మరో మనిషి వచ్చినా వారి ఖర్చులనూ భరించాలి. ఇన్ని లక్షలమందిని ఈరకంగా ఇబ్బంది పెట్టి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోంది?


నా వల్ల కాదు.. బ్యాంకుకు వెళ్లలేను

బ్యాంకు ఖాతా ఎప్పుడో తెరిచారో అది పనిచేస్తుందో లేదో.. బ్యాంకుకు వెళ్లడం నావల్ల కాదు. నేనే కాదు నాలాంటి వృద్ధులు సచివాలయం వరకు వెళ్లి పింఛన్లు తెచ్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సచివాలయాల వద్దకే వెళ్లలేని వాళ్లం బ్యాంకులకు వెళ్లి పింఛను తెచ్చుకోగలమా. ఎందుకు మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెడతారు.
- రంగమ్మ మచిలీపట్నం


  •  విజయవాడ నగరానికొస్తే.. లబ్ధిదారుల ఖాతాలు ఎక్కువగా ఇండియన్‌, సప్తగిరి బ్యాంకుల్లో ఉన్నాయి. ఇండియన్‌ బ్యాంకు శాఖలు కనీసం 2 నుంచి 10 కిలోమీటర్ల దూరాల్లో.. సప్తగిరి గ్రామీణ బ్యాంకు శాఖలైతే ఇంకా ఎక్కువ దూరంలో ఉన్నాయి.
  • పశ్చిమలో 5,039 మంది ఖాతాలు గాంధీనగర్‌, గొల్లపూడి, విజయవాడలోని పలుప్రాంతాల్లో ఉన్నాయి. వీరిలో 47 మంది ఖాతాలు సప్తగిరి గ్రామీణబ్యాంకు చిత్తూరు శాఖలో ఉన్నాయి. అంటే లబ్ధిదారులంతా వందల రూపాయలు ఖర్చు చేసి వెళ్లాల్సిన పరిస్థితి.
  •  సెంట్రల్‌ నియోజకవర్గంలోని 6,171 మంది లబ్ధిదారులకు గాంధీనగర్‌, మొగల్రాజపురం, రామవరప్పాడు, సూర్యారావుపేట, విజయవాడ ఇండియన్‌ బ్యాంకు శాఖల్లో ఖాతాలున్నాయి.

7 కిలోమీటర్ల దూరం వెళ్లాలా?

సచివాలయం కంటే బ్యాంకుకు వెళ్లి తీసుకోవడం మరింత కష్టం. మాచవరంలో ఉన్నవారు వి.కొత్తపాలెంలోని బ్యాంకుకు వెళ్లాలంటే ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు వెళ్లాలి. వేణుగోపాలపురం నుంచి వి.కొత్తపాలెం బ్యాంకుకు రావాలంటే కనీసం 7 కిలోమీటర్లు దూరం వెళ్లాలి. నా వల్ల కాదు. పింఛను తీసుకోడానికి మమ్మల్ని ఇంత కష్టపెట్టాలా?.
- కూరాకుల ప్రసాద్‌, మాచవరం
- న్యూస్‌టుడే, అవనిగడ్డ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని