icon icon icon
icon icon icon

జగన్‌ తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తాం: పవన్‌కల్యాణ్‌

‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో పట్టా పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర తీసి జగన్‌ ఫొటో వేసుకుంటున్నారని, లక్షల ఎకరాల ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు.

Updated : 01 May 2024 08:00 IST

ప్రజల ఆకాంక్షలు సాకారం చేసేలా ఉమ్మడి మ్యానిఫెస్టో
జనసేన అధినేత ధ్వజం

ఈనాడు, అమరావతి: ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో పట్టా పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర తీసి జగన్‌ ఫొటో వేసుకుంటున్నారని, లక్షల ఎకరాల ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ యాక్టును రద్దు చేస్తామన్నారు. ల్యాండ్‌, శాండ్‌, మైన్‌, వైన్‌, గంజాయి, ఎర్రచందనం, డ్రగ్స్‌, రేషన్‌ బియ్యం మాఫియాలతో రూ. 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు. విషపూరిత మద్యం తెచ్చి 35 లక్షల మంది ఆరోగ్యాలను నాశనం చేశారని, 30 వేల మంది ప్రాణాలు తీసి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేశారని దుయ్యబట్టారు. ‘గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పులపాలు చేశారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను 600 మందిని హత్య చేశారు. వివేకా హత్యకేసులో నిందితుల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నారు’ అని మండిపడ్డారు. ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. మ్యానిఫెస్టోలోని పలు కీలక అంశాలను పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘గత ఐదేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న విధ్వంసకర పరిస్థితులను చక్కదిద్ది గాడిలో పెట్టేందుకు ఎన్నికల రూపంలో ఒక మంచి అవకాశమొచ్చింది. వినాశకర పాలనను సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కూటమి అభ్యర్థులకు ఘనవిజయాన్ని చేకూర్చాలి. యువగళం, జనవాణి కార్యక్రమాల్లో వచ్చిన వినతులు, సూచనలతోపాటు ఆన్‌లైన్‌ ద్వారా అందిన సలహాలను క్రోడీకరించి ఈ మ్యానిఫెస్టోను రూపొందించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. ఇలా అన్ని రంగాల అభివృద్ధి కలగలిపి ఉంది. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ.. రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా తయారుచేసిన మ్యానిఫెస్టోను అమలు చేస్తాం’ అని పేర్కొన్నారు.

ఒక్కో కుటుంబపై రూ.8 లక్షల భారం..

‘ధరలు, పన్నులు, ఛార్జీల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ. 8 లక్షల భారం మోపారు. రూ. 10 ఇచ్చి రూ. 100 కొట్టేస్తున్నారు. పొద్దున్నే పథకం పేరుతో డబ్బులిచ్చి సాయంత్రానికి మద్యం పేరుతో దోచుకుంటున్నారు. పోలవరం, నదుల అనుసంధానాన్ని గోదాట్లో కలిపేశారు. సంపద సృష్టి ఉపాధి కల్పనా కేంద్రమైన రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. రూ.లక్ష కోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించారు. అన్నక్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, పండుగ కానుకల వంటి 100కి పైగా కార్యక్రమాల్ని రద్దు చేశారు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత వేసి 16,800 మంది బీసీలను రాజ్యాంగ పదవులకు దూరం చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రమిచ్చిన రూ. 12 వేల కోట్లను దారి మళ్లించి గ్రామ, పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు’ అని మండిపడ్డారు.

లూటీ కోసమే అప్పు..

లూటీ కోసమే జగన్‌ రూ. 13 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారని ధ్వజమెత్తారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్తు కత్తిమొన మీద వేలాడుతోంది. ఐదేళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తోంది. రాష్ట్రంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలే కనిపిస్తున్నాయి. పట్టభద్రుల నిరుద్యోగిత విషయంలో 24 శాతంతో దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాల్లో రెండో స్థానంలో ఉంది’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img