UP Polls: రాయ్‌బరేలీ సర్దార్‌.. 30 ఏళ్లుగా ఇక్కడ ఒక కుటుంబానిదే గెలుపు..!

కాంగ్రెస్‌, పీస్‌ పార్టీ, భాజపా.. పార్టీ ఏదైనా గెలుపు మాత్రం ఆ ఒక్క కుటుంబానిదే. గత మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గం.. ఒక కుటుంబానికి చెందిన నేతలకే

Published : 23 Feb 2022 01:40 IST

రాయ్‌బరేలీ: కాంగ్రెస్‌, పీస్‌ పార్టీ, భాజపా.. పార్టీ ఏదైనా గెలుపు మాత్రం ఆ ఒక్క కుటుంబానిదే. గత మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గం.. ఒక కుటుంబానికి చెందిన నేతలకే పట్టం కడుతోంది. అదే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న రాయ్‌బరేలీ సర్దార్‌ అసెంబ్లీ స్థానం. 1993 నుంచి ఈ నియోజకవర్గంలో అఖిలేశ్‌ సింగ్‌, ఆయన కుమార్తె ఆదితిసింగ్‌ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

కాంగ్రెస్‌, గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడుగా పేరొందిన అఖిలేశ్ సింగ్‌ 1993లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ ఎన్నికల్లో రాయ్‌బరేలీ సర్దార్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన విజయాల పరంపర కొనసాగింది. 1996, 2002లోనూ కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. అయితే ఆ తర్వాత అఖిలేశ్‌ సింగ్‌కు కాంగ్రెస్‌తో విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే పార్టీ ఆయనను బహిష్కరించింది.

దీంతో 2007లో జరిగిన ఎన్నికల్లో అఖిలేశ్ సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 76వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2012 ఎన్నికల సమయంలో పీస్‌ పార్టీలో చేరి పోటీ చేశారు. అప్పుడు కూడా రాయ్‌బరేలీ సర్దార్‌ ప్రజలకు ఆయనకే ఓటేశారు. 2017 ఎన్నికలకు ముందు అఖిలేశ్‌ సింగ్‌ రాజకీయాల నుంచి తప్పుకోగా.. ఆయన కుమార్తె అదితి సింగ్‌ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే గతేడాది కాంగ్రెస్‌ పార్టీపై పలుమార్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించిన అదితి.. 2021లో భాజపాలో చేరారు. తాజా ఎన్నికల్లో కాషాయ పార్టీ తరఫున పోటీ చేస్తోన్న అదితి.. మరోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. 

అదితికి పోటీగా కాంగ్రెస్‌ పార్టీ.. మనీశ్ చౌహన్‌ను బరిలోకి దించగా.. సమాజ్‌వాదీ పార్టీ ఆర్‌పీ యాదవ్‌ను నిలబెట్టింది. మరో విషయం ఏంటంటే.. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ఇంతవరకూ ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గం కూడా ఇదేనట. దీంతో రాయ్‌బరేలీ నియోజకవర్గ పోరు ఈసారి ఆసక్తికరంగా మారింది. ఈ స్థానానికి నాలుగో విడతలో భాగంగా బుధవారం(ఫిబ్రవరి 23) పోలింగ్‌ జరగనుంది. అన్ని విడతలు పూర్తయిన తర్వాత మార్చి 10న ఫలితాలు వెల్లడించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని