Nitish Kumar: చేయని పనికి క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నారు.. రాహుల్‌కు నీతీశ్‌ కౌంటర్‌

బిహార్‌లో కులగణనపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను జేడీయూ అధ్యక్షుడు, సీఎం నీతీశ్‌ కుమార్‌ తోసిపుచ్చారు. 

Published : 31 Jan 2024 15:11 IST

పట్నా: కాంగ్రెస్‌ (Congress) ఒత్తిడితోనే బిహార్‌ (Bihar)లో కులగణన (Caste Survey) జరిగిందన్న రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలను జేడీయూ అధ్యక్షుడు, రాష్ట్ర సీఎం నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) తోసిపుచ్చారు. మరొకరు చేసిన పనిని తామే చేసినట్లు ఆయన తన ఖాతాలో వేసుకుని క్రెడిట్‌ కొట్టేయాలనుకుంటున్నారని విమర్శించారు. ‘‘బిహార్‌లో కులగణన నా చొరవతో జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. 2019-20 మధ్య అసెంబ్లీ సహా.. బహిరంగ సభల వరకు ప్రతిచోటా ఈ విషయాన్ని ప్రస్తావించాను. ప్రధానిని కూడా కలిశాను. ఇప్పుడు దీనికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు లబ్ధి పొందాలనుకుంటే నేను పట్టించుకోను. ఆయనవి అర్థంలేని వ్యాఖ్యలు’’అని నీతీశ్‌ అన్నారు.

ఒంటరి పోటీపై ప్రకటన చేయండి.. ఇండియా కూటమి పార్టీలను కోరిన కాంగ్రెస్‌

ఇండియా కూటమిలోని పార్టీలు ఏం చేయట్లేదని, కనీసం సీట్ల సర్దుబాటుపైనా చర్చించడం లేదని తెలిపారు. కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టాలని తాను చెప్పలేదని, వాళ్లే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇకపై ఎన్‌డీయేను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ను ఈడీ విచారించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘ ఆయనపై ఉన్న ఆరోపణల గురించి అందరికీ తెలిసిందే. దర్యాప్తు జరుగుతోంది. వాటి గురించి నేను ఎవరినీ అడగలేదు. నాకు ఎవరూ చెప్పలేదు’’ అని అన్నారు. 

గత వారం ఇండియా కూటమిని వీడి, భాజపాతో చేతులు కలిపిన నీతీశ్‌ కుమార్‌పై భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో రాహుల్‌గాంధీ విమర్శలు చేశారు. ‘‘నీతీశ్‌ విపక్ష కూటమిని ఎందుకు వీడారో తెలుసు. బిహార్‌లో కులగణన చేపట్టాలని మేం ఆయనకు స్పష్టంగా చెప్పాం. దీనిపై కాంగ్రెస్‌, ఆర్జేడీ ఒత్తిడి తీసుకువచ్చాయి. అందుకు భాజపా వ్యతిరేకం. దీంతో నీతీశ్‌ ఇరుక్కుపోయారు. ఆయన తప్పించుకోవడానికి భాజపా దారి చూపించింది. సామాజిక బాధ్యత అందించడం కూటమి బాధ్యత. దానికి ఆయన అవసరం లేదు. కొంచెం ఒత్తిడి వచ్చినా యూటర్న్‌ తీసుకుంటారు’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని