Aryan Khan: ఆర్యన్‌ అరెస్టుపై మంత్రి నవాబ్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టు వ్యవహారంపై ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ సంచలన .....

Updated : 07 Oct 2021 10:55 IST

ముంబయి: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టు వ్యవహారంపై ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీర ప్రాంతంలోని క్రూజ్‌ నౌకలో ఎన్సీబీ దాడులు నకిలీవన్నారు. అక్కడ డ్రగ్స్‌ ఏమీ దొరకలేదని వ్యాఖ్యానించారు. షారుక్‌ని టార్గెట్‌ చేసినట్టు  నెలక్రితమే సమాచారం వచ్చిందన్న ఆయన.. క్రైం రిపోర్టర్ల గ్రూపుల్లో సమాచారం చక్కర్లుకొట్టిందని విమర్శించారు.  నౌకలో దాడుల సమయంలో ఎన్సీబీ బృందంతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉండటాన్ని ప్రశ్నించిన ఆయన.. వారిలో ఒకరు భాజపాకు చెందినవారు అని ఆరోపించారు. ఆర్యన్‌ ఖాన్‌ని అక్రమంగా అరెస్టుచేశారన్నారు. ఆర్యన్‌ అరెస్టు వెనక భాజపా కార్యకర్తల హస్తం ఉందని మంత్రి ఆరోపించారు.

ఎన్సీబీ సోదాల సమయంలో అక్కడ ఉన్న కేపీ గోసావి, మనీశ్‌ భానుషాలి ఎవరో, ఆ షిప్‌లో ఎందుకు ఉన్నారో భాజపా, ఎన్సీబీ సమాధానం చెప్పాలన్నారు. వారిద్దరిలో ఒకరు భాజపా ముఖ్య నేతలతో ఫొటోలను పోస్ట్‌ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. వీరితో భాజపాకు ఉన్న సంబంధమేంటని నిలదీశారు. భాజపా ఎన్సీబీని వాడుకొని మహారాష్ట్రపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ముంబయి నుంచి గోవాకు వెళ్తున్న క్రూజ్‌ నౌకలో నిర్వహించిన ఓ రేవ్‌పార్టీలో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న అభియోగంపై ఆర్యన్‌ సహా ఎనిమిది మందిని అధికారులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ముంబయి సిటీ కోర్టు ఆర్యన్‌ సహా పలువురు నిందితులకు ఈ నెల 7వరకు ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది.

ఓ సాక్షిగానే అక్కడికి వెళ్లా.. మనీశ్‌ భానుషాలి

మరోవైపు, మంత్రి నవాబ్‌ మాలిక్‌ చేసిన ఆరోపణలపై భాజపా కార్యకర్త మనీశ్‌ భానుషాలి స్పందించారు. తనపై మంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. డ్రగ్స్‌ పార్టీ జరుగుతున్నట్టు అక్టోబర్‌ 1న తనకు సమాచారం వచ్చిందని, తన స్నేహితుడు ఒకరు ఎన్సీబీకి సమాచారం ఇవ్వాలని చెప్పాడన్నారు. అప్పటికే ఎన్సీబీ వద్ద కొంచెం సమాచారం ఉండటంతో ఇది మరింత ఉపయోగపడిందన్నారు. అక్టోబర్‌ 2న దాడులకు ప్రణాళిక రచించగా.. ఓ సాక్షిగా తాను ఆ ప్రదేశంలో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటివరకు తాను ఏ భాజపా నేతతోనూ మాట్లాడలేదని, తనకు, ముంబయిలోని తన కుటుంబానికి పోలీస్‌ రక్షణ కావాలని కోరారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని